అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. సగం కాలిపోయిన పరిస్ధితిలో ఉన్న ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం లోని జాతీయరహాదారి 44(NH44) పై మిడుతూరు గ్రామం సమీపంలోని AMOGH ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర ఉండే టాయిలెట్ల వెనక వైపున ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గురువారం గుర్తించారు.
మృతదేహాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు….మిడుతూరు విఆర్వో రంగయ్య ద్వారా ఫిర్యాదు తీసుకొని ఐపీసీ సెక్షన్ 302,201 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా…..ఈ మహిళను ఇక్కడే సజీవ దహనం చేశారా ? లేక ఎక్కడో చంపి ఏదైనా వాహనంలో ఇక్కడికి తీసుకొని వచ్చి కాల్చివేసారా అనేది తేలాల్సి ఉంది. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి ఉన్నది. మృతదేహాన్ని పరిశీలించగా కాళ్ళకు మెట్టెలు, కాళ్ల గొలుసులు, నుదుటిన స్టిక్కర్ పెట్టుకుని ఉంది.
ఈ ఆధారాలను బట్టి పోలీసులు మహిళను గుర్తించే పనిలో ఉన్నారు. అనంతపురం జిల్లాలో గత 2,3రోజుల్లో ఎవరైనా మహిళ మిస్సింగ్ కేసు నమోదై ఉంటే పామిడి పోలీసు స్టేషన్ ను సంప్రదించాలని పోలీసు అధికారులు కోరారు.