S P Balasubramaniam: భారతదేశం తీర్చిదిద్దిన గొప్ప గాయకుడు. రెండు, మూడు తరాలు ఆయన పాటలువిని పెరిగింది. పాడింది. కొత్తతరం ఆయన శిష్యరికంలోనే ఎదిగింది. భారతదేశ గొప్ప గాయకతరంలో ఆయనది ముందు వరస.
ఆయన గాత్రం వింటే మధురాన్ని గొంతులో దాచుకున్నారా? శృతి చేయడానికి రాగాలు పోటీపడుతున్నాయా అన్నట్లుగా ఆయన పాట వినిపిస్తుంది. కథనాయలెవరైనా పాడేది మాత్రం బాలునే. ఆయన అందించిన సినీగానం 50వ వడిని దాటింది. పాట అంటే ఇలాగే పాడాలేమో అని తరాల శ్రోతలు అనుకునేట్టు చేశారు. గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు రాసుకున్నారు.
నెల్లూరు జిల్లా కొణెతమ్మ పేటలో జూన్ 4, 1946లో పుట్టారు. పేరు శ్రీపతి పండితా రాధ్యుల బాల సుబ్రమణ్యం. సంగీతంపై మక్కువ ఎక్కువ. పాటలు పాడటం హాబీ. కాలేజీల్లో సంగీత పోటీల్లో పాల్గొనటం.. సంగీత విభా వరులను నిర్వహించటంతో ఆయనకు అప్పుడే క్రేజ్ వచ్చింది. అప్పుడే సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి కళ్లలో పడ్డారు.
1966లో తన మొదటి పాటను ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ సినిమాకు పాడారు బాలు. ఇది మహాగాయకుడికి వెండితెర జన్మ. 1980లో వచ్చిన ‘శంకరా భరణం’ సినిమా బాలూ సినీ జీవితాన్ని అంతెత్తుకు తీసుకెళ్లింది. ఆ సినిమాకు జాతీయ అవార్డును కూడా సుబ్రమణ్యం గెలుచుకున్నారు. అప్పుడే దేశాన్ని గెల్చారు. బాలీవుడ్ కూడా అపరూపంగా బాలును చూసింది.
ఆ తర్వాత ఎన్నో భాషల్లో పాటలు, మరెన్నో హిట్లు.. లెక్కలేనన్ని అవార్డులు. 40వేలకు పైగా పాటలు పాడారు బాలు. అన్ని సినిమాలకు, అందరికీ ఆయనే పాడాలి. ఒక్కోసారి ఒకేరోజు 21 పాటలుకూడా పాడేసి రికార్డింగ్ థియేటర్లనే వావ్ అనిపించిన ఘటనలూ వందల్లోనే ఉన్నాయి.
గాయక గురువు
చిన్న వయసులోనే ఘంటసాల గారితో కలిసి పాడే అవకాశం బాలుది. ఆయనంటే గౌరవం. అయినా పోటీ పడిన ఘనతా బాలుదే. ఘంటసాల ఉన్నప్పుడు దక్షిణాదిన పేరుతెచ్చుకున్న బాలు, ఆ తర్వాత దాదాపు 30 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా తెలుగు సినీ పరిశ్రమను ఏలారు.
అక్కడ నుంచి గురువుగా మారారు. పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా పరిశ్రమకు యువగాయకులను అందించారు.. అందిస్తున్నారు. అలనాటి పాత మధురాల నుంచి నేటి వరకు పాట పుట్టుక, బాణీ సమకూర్చిన సంగీత దర్శకుడి విశిష్టత నేటి తరానికి వివరిస్తుంటే అందరం టీవీలకు అతుక్కుపోయాం. యూట్యూబ్‌లో తెగ చూశాం.
బుల్లితెరపై తన కార్యక్రమాల ద్వారా సంగీతంలోని సప్తస్వరాలను.. భావాలను పలికించే రాగాలను వివరిస్తూ నేటితరం గాయకులకు గురువుగా అరుదైన పాత్ర పోషించారు..
గాయక పరిపూర్ణుడు..
బాలు సంగీయ ప్రపంచంలో దశావతారాలు పోషించారు. గాయకుడిగా, స్వరబాణీలు అందించే సంగీత దర్శకుడిగా, కమల్‌హాసన్ లాంటి నటులకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నటుడిగా, నిర్మాతగా, భావి గాయకులను తీర్చిదిద్దే గురువుగా, సూక్తిముక్తావళితో నీతి సందేశాలు అందించే జ్ఞానిగా, ఇలా ఎన్నో బాధ్యతలను అవలీలగా పోషిస్తూ.. పరిపూర్ణత సాధించారు.