మహబూబ్‌నగర్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వలసలు. పనులు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు జిల్లాలో ఎక్కువ. వేసవి కాలంలో ఎక్కువగా ఆధారపడేది ఉపాధిహామీ పనులమీదే. జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించాలన్నది నిబంధన. అలాగే ఉపాధి పనులు చేసే సమయంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. కూలీలకు ఎండ నుంచి రక్షణ కోసం నీడ ఏర్పాటుతోపాటు ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలి. కానీ ఈ నిబంధనలేవీ ఆచరణకు నోచుకోవడం లేదు. మండుటెండల్లో పని చేస్తున్నవేలాది మంది కూలీలు వసతులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 14 లక్షల 34 వేల 169 మంది కూలీలు ఉన్నారు. వీరిలో6 లక్షల 77 వేల 318 మందికి జాబ్‌కార్డులు ఉండగా.. ప్రస్తుతం 64,338 మంది కూలీలు ఉపాధిహామీ పనులు చేస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగితే చికిత్స అందించడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండడం లేదు. ఎండ నుంచి కొంతసేపు ఉపశమనం పొందడానికి గుడారాలు కూడా అధికారులు ఏర్పాటు చేయలేదు. దీంతో ఎండలోనే తిప్పలు పడుతున్నామని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు అప్పగించడమే కాదు.. కూలీల భద్రతపై కూడా అధికారులు దృష్టిసారించాలి. ఇప్పటికైన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.
మరోవైపు ఓ కాంట్రక్టర్ రోడ్డు మరమ్మతులు కోసం ఎడ్మార్‌తిప్ప గుట్టలో భారీగా తవ్వకాలు జరిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తవ్వకాల కోసం ప్రభుత్వ అనుమతి తీసుకొవాలి.. కానీ ఏలాంటి అనుమతులు లేకుండ సొరంగంలా తవ్వకాలు జరిపారు. ఇలా ఏర్పడ్డ సొరంగం కిందకి వెళ్లి సేద తీరే సమయంలోనే మట్టిదిబ్బలు మీదపడి పది మంది మృతి చెందారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇంత ప్రమాదకరమైన తవ్వకాలు జరిపిన మట్టి మాఫియాపై మైనింగ్ అధికారులు ఏలాంటి చర్యలూ తీసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషాద ఘటనతో తీలేరు అంతా కన్నీరుమున్నీరైంది.
తీలేరు గ్రామంలో ఏ వాడలో చూసిన విషాద ఛాయలు అలుముకున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు రోజు ఈ సంఘటన చోటుచేసుకోవడంతో జిల్లాలోని ప్రధాన నాయకులంతా బాధితుల కుటుంబాలను పరామర్శించారు. అన్ని విధాలుగా అదుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఇంతవరకు తమ గ్రామానికి మళ్లీ రాలేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలకు సరైన న్యాయం చేయలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా బతుకుదెరువు కోసం ఉపాధి హామీ పనులకు వెళ్లిన పదిమంది మహిళల జీవితాలు మట్టిలో కలిసిపోయాయి. ఇప్పటికైనా అధికారులు మొద్దునిద్ర వీడి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.