వృక్షో రక్షతి రక్షితః : పద్మశ్రీ వనజీవి రామయ్యకు ఆక్సిడెంట్

  • Publish Date - March 31, 2019 / 02:22 AM IST

పద్మశ్రీ పురస్కార గ్రహీత, వనజీవి రామయ్య ఆసుపత్రిలో చేరారు. ఓ ప్రమాదంలో గాయపడ్డారు. దీనితో కుటుంబసభ్యులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన్ను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం..మరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

ఖమ్మంలో తన మనువరాలిని చూసేందుకు మార్చి 30వ తేదీ శనివారం రామయ్య బైక్‌పై వెళ్లారు. అనంతరం తిరిగి వస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం గుండా వెళుతుండగా ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొంది. దీనితో వనజీవి రామయ్య కిందపడిపోయారు. గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించారు. 108కి ఫోన్ చేసి అంబులెన్స్‌లో ఖమ్మం పెద్దాసుపత్రికి తరలించారు. రామయ్యకు భుజం ఎముక భాగంలో గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. 

మొక్కల పెంపకం మీద ప్రజల్లో రామయ్య అవగాహన కల్పిస్తుంటారు. ఎక్కడికి వెళ్లినా..మొక్కల పెంపకం మీద ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంటారు. పర్యావరణం కోసం విశేషంగా కృ‌షి చేస్తుంటారు. అందుకే ఆయన పేరు వనజీవి రామయ్యగా స్థిరపడింది. ఎండాకాలంలో ఆయన ఇంట్లో ఉండకుండా అడవి బాట పడుతారు. అక్కడ విత్తనాల కోసం గాలిస్తారు. బోలెడన్ని చెట్ల గింజలు, రకరకాల గింజలు..సేకరించి బస్తాల్లో నింపుతారు వనజీవి రామయ్య. తొలకరి చినుకులు పడిన అనంతరం ఆ విత్తనాలను నాటే కార్యక్రమంలో మునిగిపోతారు. ఇలా ఎన్నో చెట్లు నాటారు. ఆయన చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.