కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు లాక్ డౌన్ మంత్రాన్నే జపించాయి. నెలలపాటు ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీన్ని ప్రజలు భరించలేకపోతున్నారు. కానీ తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో భారత్ తో సహా చాలా దేశాల్లో అన్ లాక్ మొదలైంది. కానీ ఆస్ట్రేలియాలో మాత్రం ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలుచేస్తున్నారు. దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన వారిని పోలీసులు అరెస్ట్ లు కూడా చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, విక్టోరియా నగరాలు కరోనా హాట్‌స్పాట్‌గా మారటంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ ను కొనసాగిస్తోంది. లాక్ డౌన్ ఎత్తేయాలంటూ నగరప్రజలు కొందరు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జో బుహ్లెర్ అనే ఓ గర్భిణీ కూడా పాల్గొంది.
దీంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి.. భర్త, పిల్లల ఎదురుగానే జోను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ ను ఆమె భర్త వీడియో తీసి సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ చేశారు. ఈవీడియోను లక్షల మంది నెటిజన్లు చూశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ మాత్రం కనికరం లేకుండా గర్భవతిని అరెస్ట్ చేయడం దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై పోలీసులు మాట్లాడుతూ..‘జో లాక్‌డౌన్ నియమాలను ఉల్లంఘించడమే కాక.. ఇతరులు కూడా ప్రోత్సహిస్తూ నిరసన ర్యాలీలు చేస్తున్నారు..ఇది ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొనసాగించే ప్రక్రియ..దాన్ని వ్యతిరేకిస్తూ పలువురితో కలిసి ర్యాలీలు నిర్వహిస్తే కరోనా మరింత వ్యాప్తి చెందుతుంది. దీంతో లాక్ డౌన్ మరింతగా పొడించే అవకాశాలు కూడా ఉన్నాయి. పలువురు ఒకే చోట ఉండకూడదనే లాక్ డౌన్ ఉద్ధేశ్యం..అటువంటిది అందరూ కలిసి ఒకేచోట చేరి ర్యాలిలు చేయటం సరైందికాదు…దాన్ని ప్రోత్సహిస్తున్న ఆమెను అందుకే అరెస్ట్ చేశాం. ఆమె ఒక్కరినే కాదని ఇప్పటికే నలుగురు పురుషులను కూడా అదుపులోకి తీసుకున్నాం అని పోలీసులు తెలిపారు.