విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాఫ్తు
విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాఫ్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ విజయ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి వై.వి.అనూరాధ, రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జి టి.భాస్కర్‌రావులను సభ్యులుగా నియమించింది. అవసరమైతే మరొకరిని సభ్యుడిగా చేర్చుకునేందుకు సిట్‌కే అవకాశమిచ్చింది. కుంభకోణంపై విచారణ జరిపేందుకు 3 నెలల గడువు ఇచ్చింది ప్రభుత్వం. ఈ కమిటీ 3 నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.
రెవెన్యూ రికార్డులు, వెబ్ ల్యాండ్‌లో ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వేతర భూములుగా మార్చిన అన్ని కేసులను దర్యాప్తు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాజీ సైనిక ఉద్యోగులు, రాజకీయ బాధితులకు ప్రభుత్వమిచ్చిన భూముల విక్రయానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసిన వ్యవహారం, ప్రభుత్వ భూముల కబ్జా, ఆక్రమణ కేసులను దర్యాప్తు చేయాలని చెప్పింది.
నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ప్రభుత్వ భూముల కేటాయింపు, భూరికార్డులను తారుమారు చేసిన వ్యక్తుల గుర్తింపు, దానివల్ల లబ్ధి పొందిన ప్రభుత్వ అధికారులు, అధికారులు కాని వారు ఎవరో నిగ్గుతేల్చడమే సిట్ ముందున్న లక్ష్యం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములపై అక్రమార్కులు కన్నేసిన తీరు, ఒక వ్యూహం ప్రకారం వాటిని కబ్జా చేసిన తీరు సంచలనమైంది.
తమ పార్టీలోని దొంగలే భూ కబ్జాలు చేశారంటూ విశాఖకు చెందిన ఒక మంత్రి గతంలో ఆరోపించడం, కబ్జాదారులు తనను హత్య చేస్తామని బెదిరించారని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మరో పార్టీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేయడం రాజకీయంగా కలకలం రేపాయి. ప్రజల్లోనూ చర్చకు దారితీశాయి. టీడీపీ ప్రభుత్వం విశాఖ భూ అక్రమాలపై ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్‌ను నియమించగా.. ఆ కమిటీ నివేదిక సైతం ఇచ్చింది.
రెండేళ్ల క్రితం విశాఖలో సంచలనం సృష్టించిన భూ కుంభకోణంపై జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో టీడీపీ నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలతో నిజాలను వెలికితీసేందుకు సిట్ రంగంలోకి దించింది. విశాఖలో విలువైన భూములు అప్పట్లో కబ్జాకు గురయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. పెందుర్తి నుంచి భీమునిపట్నం వరకున్న పేదల భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములకు రెక్కలు వచ్చాయని అప్పటి ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. కబ్జాకు గురైన భూముల విలువ వేల కోట్లలో ఉంటుందని అంచనా వేశాయి. ఇందులో టీడీపీ పెద్దలంతా ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. మరి.. కొత్త సిట్ ఈ కేసును రీ ఓపెన్ చేస్తే వారంతా నిజంగా బయటకు వస్తారా? ప్రభుత్వ భూములకు న్యాయం జరుగుతుందా? పేదలకు ఆ భూములు దక్కుతాయా? నిజంగా ఇందులో దోషులకు శిక్ష పడుతుందా? అన్నది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ కేంద్రంగా భారీ భూ కుంభకోణం జరిగిందని, దీంట్లో ప్రధాన ముద్దాయి మాజీ సీఎం చంద్రబాబే అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. తమ ప్రభుత్వం భూ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించిందన్నారు. 3 నెలల్లో ఫిర్యాదులు స్వీకరించి దోషులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2014 హుదూద్ తుపాను సందర్భంగా విశాఖకు వచ్చిన చంద్రబాబు ఆధ్వర్యంలోనే 20 వేల ఎకరాల వరకూ భూముల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో 2,500 ఎకరాలను విశాఖ జిల్లాలో చంద్రబాబు సేకరించారని అన్నారు. గీతం అధ్యక్షుడు శ్రీభరత్ ఆంధ్రా బ్యాంక్ లో రూ.13 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టేందుకు సిద్ధమయ్యాడని ఆరోపించారు. ఇండియన్ బ్యాంకులో వందల కోట్ల రూపాయల రుణం తీసుకుని ఎగ్గొట్టిన గంటా శ్రీనివాసరావు దారిలోనే టీడీపీ నేతలు పయనిస్తున్నారని విమర్శించారు.