అమరావతి కూడా రాజధానే: అక్కడ అభివ‌ృద్ధి చేస్తే ఉద్యోగాలు

  • Publish Date - February 5, 2020 / 06:31 AM IST

ఆంధ్రరాష్ట్ర లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, మూడు రాజధానులు అనేది అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని గేట్‌ వే హోటల్‌ల్లో ‘ది హిందూ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ కార్యక్రమంలో మాట్లాడిన జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

అన్ని ప్రాంతాలల్లో అభివృద్ధి సమానంగా చేయాలి అన్నదే తన అభిమతమని జగన్ పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నపుడు తాను ఒక తండ్రిలాగా ఆలోచించాలని, అందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  విశాఖ అన్ని విధాల అభివృద్ధి చెందింది అని, అమరావతి ఇప్పటికి ఇప్పుడు అన్ని సదుపాయాలు సమాకూర్చడం అంటే కష్టం అయిన పని అని, లెజిస్లేటివ్ క్యాపిటల్ మాత్రం.. అమరావతిలోనే ఉంటుందని అన్నారు. అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది.. వైజాగ్ మాత్రం ఎగ్జిక్యుటీవ్ క్యాపిటల్ గా ఉంటుందని అన్నారు. సీఎం అక్కడ ఉంటాడు.. సచివాలయం అక్కడ ఉంటుందని అన్నారు. 

రాయలసీమ.. కర్నూల్లో న్యాయ రాజధాని ఉంటుందని, కర్నూల్ ఎప్పుడో రాజధానిగా ఉందని, ఇప్పుడు దానిని కూడా అభివృద్ధి చెయ్యాల్సిన అవసరం ఉందని అన్నారు.  అమరావతిలో అయితే మౌలిక సదుపాయాలకే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చుచేయాల్సి ఉంటుందని, దీని కోసమే రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేయాలని, ఇప్పటికి అమరావతిపై ఖర్చు చేసింది రూ.5,674 కోట్లు మాత్రమేనని, రూ.లక్ష కోట్లు పెట్టాల్సిన చోట ఖర్చులో 10 శాతం విశాఖపట్నంలో పెడితే బాగా అభివృద్ధి చెందుతుందని ఇప్పటికే రాష్ట్రంలో నంబర్ 1 నగరంగా విశాఖ ఉందని అక్కడ రాజధాని పెడితే రాబోయే కాలంలో అక్కడ ఉద్యోగాలు వస్తాయని అన్నారు.