యనమల వ్యూహాలు : సొంతసీటుపై కన్ను ?

  • Publish Date - January 23, 2019 / 02:21 PM IST

తూర్పు గోదావరి : ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు సొంత సీటుపై కన్నేశారా..? సుదీర్ఘకాలం తన చేతిలో ఉన్న తుని కోటలో మళ్లీ పాగా వేసేందుకు.. చకచకా పావులుకదుపుతున్నారా..? అసలు యనమల అనుకున్న వ్యూహాలు ఫలిస్తాయా..? టీడీపీ సీనియర్‌ నేతల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో రాజ‌కీయ ఆరంగేట్రం చేసిన ఈ న్యాయ‌వాది ఆ త‌ర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. 2004 వ‌ర‌కూ వ‌రుస‌గా 6సార్లు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. ఏపీలో మంత్రిగా, శాస‌న‌స‌భా స్పీక‌ర్‌గా, విప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో పీఏసీ చైర్మన్‌గా ప‌నిచేశారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే అధికారంలో ఉన్నా, ప్రతిప‌క్షంలో ఉన్నా క్యాబినెట్ హోదాలో సుదీర్ఘకాలం కొనసాగిన నేత‌గా య‌న‌మ‌ల గుర్తింపు పొందారు. 

1983లో ఎన్టీఆర్ పిలుపుతో రాజ‌కీయ ఆరంగేట్రం 
2004 వ‌ర‌కూ వ‌రుస‌గా 6సార్లు విజ‌యం 
మంత్రిగా, శాస‌న‌స‌భా స్పీక‌ర్‌గా 
విప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో పీఏసీ చైర్మన్‌గా 

తిరుగులేని నేతగా ఎదిగిన యనమలకు తొలిసారి 2009 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. యనమల చేతిలో మూడు సార్లు ఓటమి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్ధి రాజా అశోక్‌ బాబు.. ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో యనమలకు ఓటమి రుచి చూపించారు. ఆ తరువాత ప్రత్యక్ష ఎన్నికలకు యనమల దూరమయ్యారు. రాజ్యస‌భ సీటు ఆశించిన ఆయ‌న‌కు .. చివ‌ర‌కు ఎమ్మెల్సీ హోదా ద‌క్కింది. అయితే మ‌ళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే .. ఆ కోటాలో మళ్లీ మంత్రికాగ‌లిగారు. 2014 ఎన్నిక‌ల్లో య‌న‌మ‌ల వార‌సుడిగా ఆయ‌న సోద‌రుడు య‌న‌మ‌ల కృష్ణుడు రంగంలో దిగారు. కానీ ఆయ‌న కూడా వైసీపీ అభ్యర్ధి దాడిశెట్టి రాజా చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యారు.

2009 ఎన్నికల్లో తొలిసారి ఎదురుదెబ్బ 
మూడు సార్లు ఓడిన కాంగ్రెస్‌ అభ్యర్ధి రాజా అశోక్‌ బాబు
యనమలకు ఓటమి రుచి చూపించారు
రంగంలోకి సోద‌రుడు య‌న‌మ‌ల కృష్ణుడు 
దాడిశెట్టి రాజా చేతిలో ప‌రాజ‌యం 

తుని నియోజకవర్గం అభివృద్ధి విషయంలో యనమల రామకృష్ణుడు పెద్దగా శ్రద్ధపెట్టలేదనే ప్రచారంతో యనమల బ్రదర్స్‌ మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీన్ని గమనించిన యనమల గత కొంతకాలంగా సొంత నియోజకవర్గం మీద దృష్టి సారించారు. పదేపదే స్వగ్రామం వస్తూపోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. తొండంగి మండ‌లంలోని ఆయన స్వగ్రామం ఏవీ న‌గ‌రంలో య‌న‌మ‌ల ఫౌండేష‌న్ పేరుతో..ప‌లు కార్యక్రమాలు సొంతంగానూ చేప‌ట్టారు. దీంతో వచ్చే ఎన్నిక‌ల్లో రాజ‌కీయంగా ప్రభావం చూపాల‌ని.. మ‌ళ్లీ ప‌ట్టు సాధించాల‌ని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్రయ‌త్నిస్తున్నట్టు ప‌లువురు భావిస్తున్నారు. అందుకు త‌గ్గట్టుగా ఈసారి త‌మ వార‌సులుగా త‌మ్ముడు కృష్ణుడు స్థానంలో సొంతంగా త‌న కుమార్తెను గానీ, సోద‌రుడి కుమారిడిని గానీ బ‌రిలో దింపే యోచ‌న‌లో ఉన్నార‌నే ప్రచారం సాగుతోంది…

తుని నియోజకవర్గంలో పరిణామాలు యనమల కుటుంబానికి ఏమేరకు సానుకూల ఫలితాలు అందిస్తాయన్నదే ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. ముఖ్యంగా దివీస్‌ పరిశ్రమ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమం కారణంగా .. యనమలకు సొంత సామాజికవర్గంలోనే కొందరు కీలక నేతలు దూరమయ్యారు. ఇది యనమలకు కొంత ఇబ్బంది కలిగించే విషయమే. అయితే ఈసారి ఎన్నికల్లో జనసేన కారణంగా కాపు సామాజికవర్గంలో ఓట్ల చీలిక ఖాయమని యనమల వర్గం భావిస్తోంది. ఇది తమకు కలిసొచ్చే అంశంగా పరిగణిస్తోంది. జనసేన తరపున మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌ బాబు పోటీ చేసే అవకాశం ఉన్నందున .. వైసీపీ ఓటు బ్యాంక్‌కు చిల్లు ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఆవిధంగా తాము గట్టెక్కొచ్చని యనమల వర్గం ఆశపడుతోంది. 

దివీస్‌ పరిశ్రమ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ 
రాజా అశోక్‌ బాబు పోటీ చేసే అవకాశం 
వైసీపీ ఓటు బ్యాంక్‌కు చిల్లు ఖాయమనే ప్రచారం 

ఏది ఏమైనా  ఒక‌నాటి పెట్టని కోట‌గా ఉన్న తునిలో .. తిరిగి హావా కోసం యనమల చేస్తున్న ఈ ప్రయ‌త్నాలు .. ఏమేర‌కు ఫ‌లిస్తాయ‌న్నది ఆస‌క్తిగా మారింది.