మోహన్ బాబు చాలా మంచోడు : లక్ష్మీ పార్వతి సర్టిఫికేట్

  • Publish Date - April 2, 2019 / 11:18 AM IST

సినీ నటుడు మోహన్ బాబు తమ కుటుంబానికి ఎలాంటి హానీ చేయలేదని..కేవలం బాబుతో కలవడమే చేసిన తప్పని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు. తప్పని పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబుతో వెళ్లారని.. అందుకు కారణాలు ఇవే అంటూ చెప్పుకొచ్చారు. కొన్ని రోజులుగా లక్ష్మీ పార్వతి – మోహన్ బాబుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న పలు వ్యాఖ్యలు చేశారు. వీటిని లక్ష్మీపార్వతి సమాధానం చెప్పారు.

2019, ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రాన్ని బాబు పాలించడం సిగ్గు చేటన్నారు. గతంలో సినీ రంగాన్ని తన చుట్టూ తిప్పుకున్నాడని, అశ్వనీదత్, రాఘవేంద్రరావు, మురళీమోహన్ తో పాటు మరొకరు బాబుకు అండగా ఉన్నారని తెలిపారు. హీరో, హీరోయిన్లను బాబు తిప్పుకుంటే.. జగన్ మాత్రం ఏ సినిమా ఫంక్షన్‌కు వెళ్లలేదన్నారు. ఎంతో అభిమానంతో స్టార్స్ వైసీపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. 

బుద్ధ వెంకన్నకు ఏమీ తెలియదన్నారు లక్ష్మీపార్వతి. అప్పట్లో బుద్దా ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 1992లో ఎన్టీఆర్ వెంటే మోహన్ బాబు ఉన్నాడని, అతను రామభక్తుడని మెచ్చుకున్నారు. పార్టీలో ఉంటూ దెబ్బలు తిన్నాడని, పార్టీ కోసం ఎంతో పనిచేశాడని కితాబిచ్చారు. మురళీ మోహన్ మధ్యలో పారిపోయారని.. మోహన్ బాబు అలా చేయలేదన్నారు. చివరిలో ఎన్టీఆర్ వెంట ఆయన లేడని.. ఆ సమయంలో చంద్రబాబు అందర్నీ ప్రలోభ పెట్టాడన్నారు.

మోహన్ బాబు హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు ఇన్వెస్ట్ చేశారని.. ఎన్టీఆర్ వెంట ఉంటే ఆ వాటా ఇవ్వనని చంద్రబాబు బెదిరించారని చెప్పుకొచ్చారు. దీంతో బాబు వెంట మోహన్ బాబు వెళ్లడం జరిగిందని ఆనాటి సంగతులను బయటపెట్టారు. వాటా ఇవ్వకుండా భువనేశ్వరి పేరిట రాసి.. మోహన్ బాబుకు నష్టాలు తెప్పించాడన్నారు. ఈ విషయంలో మోహన్ బాబు ధర్నా కూడా చేశారన్నారు. తన భర్త ఎన్టీఆర్‌కు, రాష్ట్రానికి ఎవరు మోసం చేస్తున్నారంటే అదే చంద్రబాబు మాత్రమే అని లక్ష్మీ పార్వతి ప్రకటించారు.