టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడుతోంది. పల్నాడు పచ్చగా ఉంటే ఓర్వలేకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పల్నాడును దోచుకున్నారని ఇప్పుడు తమపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతం, ఆత్మకూరు గ్రామం చాలా ప్రశాంతంగా ఉందని ..అక్కడ రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవని చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్దికోసం పార్టీలకు ఆపాదించారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్నది సరైన పద్దతి కాదని, నిజమైన బాధితులను గుర్తించేందుకు ఫ్రభుత్వం పోలీసులను ఇతర అధికారులను ఆత్మకూరు పంపించిందని ఆయన అన్నారు.
గత 5ఏళ్లలో పల్నాడులో కోడెల కుటుంబం, యరపతినేని బాధితులు వందల సంఖ్యలో ఉన్నారని వారి బాధలు కూడా వినాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. కోడెల కుటుంబం కోట్లాది రూపాయలు ప్రజల నుంచి దారుణంగా వసూలు చేసిందని ఆయన తెలిపారు. కోడెల కుటుంబం నరసరావుపేట సత్తెనపల్లిలో దోచుకున్న దోపిడీ తెలిసిీ చంద్రబాబు మిన్నకుండి పోయారని ఆయన అరోపించారు. ప్రజాస్వామ్యంలో ఒకరికి ఒకన్యాయం ఇంకోకరికి ఇంకోన్యాయం ఉండదని…. కోడెల, యరపతినేని బాధితులకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.
కోడెల కుటుంబం అంగన్ వాడీ టీచర్ మొదలు రైల్వే కాంట్రాక్టర్ల దాకా ఎవరెవరిని ఏ రకంగా బెదిరించి డబ్బులు వసూలు చేసింది బాధితుల సాక్షిగా వారి ఆగడాలను ఎమ్మెల్యే వివరించారు. దీనిపై చంద్రబాబు పల్నాడు వెళ్లటానికంటే ముందే నరసరావుపేట, సత్తెనపల్లి వచ్చి కోడెల బాధితులకు న్యాయం చేసి ఆత్మకూరు వెళ్లాలని గోపిరెడ్డి సూచించారు.