చిన్నారి లేఖకు కదిలిపోయిన సీఎం జగన్: కలెక్టర్ కు ఆదేశాలు

  • Publish Date - September 14, 2019 / 10:22 AM IST

‘మమ్మల్ని వెలివేశారంట: సీఎం జగన్ కు లేఖ రాసిన చిన్నారి’ అనే శీర్షికతో నాల్గవ తరగతి చిన్నారి ముఖ్యమంత్రి జగన్ కు తమ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ రాసిన లేఖను 10Tv ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. చిన్నారి రాసిన లేఖ విషయాన్ని తెలుసుకున్న జగన్ కదిలిపోయారు.

వెంటనే ఈ విషయంపై చర్యలు తీసుకోవాలంటూ ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోడూరి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని వెలివేయగా నాలుగో తరగతి చదువుతున్న పుష్ప రాసిన లేఖపై సీఎం జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే గ్రామానికి వెళ్లి కుటుంబ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రకాశం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించగా కలెక్టర్ నేరుగా వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో చిన్నారి తండ్రితో మాట్లాడగా నాలుగు రోజుల్లో తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యుడు కోడూరి రాజు ఆరోపించినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ తరపున సర్పంచ్‌గా పోటీ చేయాలనుకుంటే, అది ఇష్టంలేని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు బెదిరిస్తున్నట్లు కోడూరి రాజు చెబుతున్నారు. ఆమంచి అండతో అతని అనుచరులు మరొకరు గ్రామంలో సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీచేయాలని మా మీద దాడి చేశారు. పొలం, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు అని చెప్పారు.

అలాగే మా వలలు, బోటు, ఇంజిన్ ఎత్తుకెళ్లి జూలై 17వ తేదీన మా ఇంటి మీద దాడి చేసి, అమ్మ చేతి వేళ్లు విరగ్గొట్టారని వెల్లడించారు. అంతేకాదు గ్రామం నుంచి వెలివేసినట్లు సీఎంకు లేఖ రాసిన చిన్నారి పుష్ప తండ్రి కోడూరి రాజు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ ఘటనపై విచారణ చేస్తున్నారు.