మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వదంతులు నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వివేకా హత్య కేసులో సునీల్ గ్యాంగ్ ప్రమేయం ఉందంటూ ప్రచారం జరిగింది. అక్టోబర్ 13వ తేదీ ఆదివారం ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. అబద్దపు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివారం ఉదయం నుంచి కడప జిల్లాలో వివేకా హత్య కేసు విషయంలో వివిధ రకాల వదంతులు వ్యాపించాయి. మీడియాలో కథనాలు వచ్చాయి. కేసు పూర్తిగా ఇన్వేస్టిగేషన్ జరుగుతోందని తెలిపారు. అసత్య ప్రచారాలు చేయడం వల్ల కేసు పక్కదారి పట్టించినట్లువుతుందన్నారు. మీడియా సహనం పాటించాలని, దర్యాప్తుకు సహకరించాలని సూచించారు. చాలా సున్నితమైన అంశమని, కథనాలు ప్రచురించే సమయంలో తనను సంప్రదించవచ్చన్నారు. అసత్య ప్రచారాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు.
మార్చి 14వ తేదీ అర్ధరాత్రి వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పదస్థితిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. బాత్ రూమ్‌లో రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. మొదట అతను గుండెపోటు కారణంగా మరణించాడని నివేదికలు వచ్చినా, క్రమేపీ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడన్న విషయం బయటకు వచ్చింది. అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు..ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేశారు. దర్యాప్తు కొనసాగుతుండగానే…వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. విచారణ పేరుతో సిట్ వేధిస్తోందంటూ కూల్ డ్రింక్ లో గుళికలు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీనివాస్ రెడ్డి సూసైడ్ నోట్ లో వెల్లడించారు.
1950 ఆగస్టు 8న పులివెందులలో వివేకా జన్మించారు. వైఎస్ కు వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పనిచేశారు. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. 1989, 1994లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004లో కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. 2010లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో వ్యయసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో సెప్టెంబర్‌లో ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుడిగానూ పనిచేశారు. వివేకానందరెడ్డికి భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు.
Read More : కొరత లేకుండా : వరదల వల్లే ఇసుక సరఫరాకు అంతరాయం