ఏపీలో రైతులకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 14వ తేదీ సోమవారం వ్యవసాయ మిషన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రూ. 12 వేల 500 నుంచి రూ. 13 వేల 500కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు విడతలుగా ఇవ్వాలని డిసైడ్ అయ్యింది ఏపీ ప్రభుత్వం. ఐదేళ్లలో రైతులకు రైతు భరోసా కింద రూ. 67 వేల 500 పెట్టుబడి సాయం అందచేయనుంది. ఈ పథకాన్ని అక్టోబర్ 15న నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం జగన్ ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జగన్..ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగా రైతు భరోసా పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ స్కీమ్ అమలు కోసం రూ. 5 వేల 510 కోట్లు రిలీజ్ చేసింది. అక్టోబర్ 15వ తేదీన రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయనుంది. ప్రతి రైతుకు రూ. 12 వేల 500 చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు. తాజాగా ఈ డబ్బులను పెంచడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సాధికార సర్వే ఆధారంగా ఆర్టీజీఎస్ ద్వారా జిల్లాకు పంపిన రైతుల జాబితాను క్షేత్రస్థాయిలో విచారించి నివేదిక పంపారు. తొలి దశలో గుర్తించిన లబ్ధిదారులకు సాయం అందిస్తారు. జాబితాలో పేర్లు లేని వారి నుంచి సేకరించిన దరఖాస్తులను రాష్ట్ర స్థాయిలో పరిశీలించాక… వారికి కూడా సాయం అందిస్తారు. కౌలు రైతులు, సాధికార సర్వేలో పేర్లు లేని వారు తాజాగా వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అలాంటివి 70 వేలు ఉన్నట్లు అంచనా. మరోసారి పరిశీలించాక.. అర్హతలను బట్టి లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు. 2020 నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Read More : జగన్‌పై బాబు ఆగ్రహం : 26 కేసులు పెట్టారు..ఏం చేయగలిగారు