కొత్తవారికి ఛాన్స్ : YSRCP ఫస్ట్ లిస్ట్..ఎంపీ అభ్యర్థులు వీరే

  • Publish Date - March 17, 2019 / 01:21 AM IST

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వైసీపీ దూకుడు పెంచింది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఏపీలో తొలి విడతగా 9 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను ప్రకటించింది. ఎవరూ ఊహించని విధంగా జగన్.. తొలి జాబితాలో కొత్త వారికే ఎక్కువగా చాన్స్ ఇచ్చారు. జాబితాలోని 9 మంది అభ్యర్థుల్లో వైఎస్ అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి మాత్రమే సిట్టింగ్ ఎంపీలు కాగా… మిగిలిన ఏడుగురు కొత్తవారే. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. 

నియోజకవర్గం అభ్యర్థి పేరు
కడప అవినాశ్ రెడ్డి
రాజంపేట మిథున్ రెడ్డి
అరకు గొట్టేటి మాధవి
బాపట్ల నందిగం సురేశ్
అమలాపురం చింతా అనురాధ
అనంతపురం తలారి రంగయ్య
కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్
చిత్తూరు రెడ్డప్ప
హిందూపురం గోరంట్ల మాధవ్

వైసీపీ తొలి జాబితాలో ఒక ఎస్టీ, ముగ్గురు బీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు రెడ్డి సామాజికవర్గ నేతలకు టికెట్లు దక్కాయి. తొలి జాబితాలో కొత్త వారికే ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. నెల్లూరులో మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఒంగోలులో వైవీ సుబ్బారెడ్డి, తిరుపతిలో వరప్రసాద్‌లు వైసీపీ సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. కానీ, ఈ ముగ్గురి పేర్లను తొలి జాబితాలో ప్రకటించకపోవడం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరిచింది. 

గత ఎన్నికల్లో అరకులో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన కొత్తపల్లి గీత వైసీపీకి దూరమవడంతో ఆమె స్థానంలో గొట్టేటి మాధవికి అవకాశమిచ్చారు. ఇక కర్నూలులో కూడా వైసీపీ తరఫున గెలిచిన బుట్టా రేణుక టీడీపీలో చేరి మళ్లీ తిరిగి వైసీపీ గూటికి వచ్చారు. అయితే.. బుట్టా రేణుక వెళ్లిపోయిన తర్వాత అక్కడ పార్లమెంటరీ ఇన్‌‌చార్జిగా ఉన్న సంజీవ్ కుమార్‌కు జగన్ టికెట్ ఇచ్చారు. హిందూపురంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన డి.శ్రీధర్ రెడ్డిని పక్కనపెట్టి ఆయన స్థానంలో మాజీ సీఐ గోరంట్ల మాధవ్‌ను బరిలో దింపారు. తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసుల మీద జేసీ దివాకర్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారంటూ గతంలో మాధవ్.. మీసం మెలేసి వార్నింగ్ ఇవ్వడం పెను సంచలనం సృష్టించింది. ఇక చిత్తూరులో కూడా కొత్త వ్యక్తి అయిన రెడ్డప్పను బరిలో నిలిపింది వైసీపీ. ప్రస్తుతం వైసీపీ హవా కొనసాగుతోందని జగన్ భావిస్తున్నారని.. అందుకే మెజార్టీ సీట్లను కొత్తవారికి కేటాయించారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మిగతా అభ్యర్థుల జాబితాను మార్చి 17వ తేదీ ఆదివారం ఇడుపులపాయలో ప్రకటించనున్నారు జగన్.