తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఏపీ సర్కార్ నాణ్యమైన బియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మకమైన ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహణ్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఈ నాణ్యమైన బియ్యాన్ని గ్రామ వాలంటీర్లు స్వయంగా ప్రజలకు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజుకు గ్రామ వాలంటీర్ రెండు రోజుల కిందట నాణ్యమైన బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ఫోటో దిగి ఫేస్ బుక్ లో షేర్ చేశారు.
జీఎంఈ కాలనీలోని మా ఇంటికి వాలంటీర్ ఎస్.ప్రసాద్ వచ్చి రేషన్ అందజేశారు. వాలంటీర్లు చక్కగా పనిచేస్తున్నారు.. సరుకులను నేరుగా లబ్దిదారుల ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నారు. రేషన్ ధరకు అయ్యే మొత్తమే తీసుకుంటున్నారని గానీ అంతకంటే ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోవడం లేదు. ఏదైనా సంక్షేమ పథకాలను అదే రోజున అందజేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోంది. గుమ్మం దగ్గరకే వచ్చి వారు సేవలందిస్తున్నారు. ఇదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోని పారదర్శకత అంటూఫేస్ బుక్ లో వివరించారు.
అయితే ఈ ఫొటో వైరల్ కావడంతో ఎమ్మెల్యే అప్పలరాజుకు తెల్ల రేషన్‌కార్డు ఎలా వచ్చిందంటూ సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే రేషన్ కార్డు కలిగి ఉండటంతో పాటుగా..పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం తీసుకోవటం పైన విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే తన ఫేస్ బుక్ పోస్ట్ కిందే ఎమ్మెల్యే పలు సందేహాలకు వివరణ ఇచ్చారు. నాకు తెల్లరేషన్ కార్డు ఉందని తెలియదు.. ఈ విషయం కుటుంబసభ్యులకు కూడా తెలియదు. తెల్లరేషన్ కార్డుదారుడునైతే ప్రతి నెలా నా రేషన్, ఇతర బిపిఎల్ సంక్షేమ పథకాలు ఏమవుతున్నాయి.. నాకు నెల నెల రేషన్ అందనప్పుడు దానిని ఎద్దుకు రద్దుచేయలేదు అని ఆయన ప్రశ్నించారు. దీని పైన విచారణకు ఆదేశిస్తానని చెప్పుకొచ్చారు. .