స్థానిక సమరానికి సమయం దగ్గర పడడంతో పాలమూరు జిల్లా పరిషత్ పీఠం కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జెడ్పీ సీటు కోసం అధికార పార్టీలోని చిన్నచిన్న లీడర్లంతా కీలక నేతలతో టచ్‌లోకి వెళ్లిపోయారు. సీటు కోసం లాబీయింగ్ మొదలుపెట్టారు. అధికారపార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా జెడ్పీ పీఠంపై జెండా పాతాలని తహతహలాడుతున్నాయి. ధీటైన అభ్యర్థులను వెతికే పనిలో పడ్డాయి.
విభజనకు ముందు ఉమ్మడి జిల్లాలో 64 జెడ్పీటీసీ స్థానాలుండగా.. ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లాలో 14 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజక వర్గాల్లోని జెడ్పీటీసీలు మహబూబ్ నగర్ పరిధిలోకి వస్తాయి. జెడ్పీ పీఠం ఈసారి జనరల్ కావడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డిని కలుస్తున్నారు. ఒకరికి ఇద్దరు నేతలను కలిసి టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అటు.. ఈసారి జెడ్పీ పీఠాన్ని తమ నియోజకవర్గానికి కేటాయించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో ఈ నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ టికెట్లకు డిమాండ్ పెరిగింది.
అమరచింత మాజీ ఎమ్మెల్యే సువర్ణ సుధాకర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే సన్నిహితుడు రాజశేఖర్ రెడ్డి, భూత్పూరు వైస్ ఎంపీపీ కదిరె శేఖర్ రెడ్డి, యువజన నాయకుడు మందడి కిరణ్ కుమార్ రెడ్డి, అడ్డాకుల జెడ్పీటీసీ రామన్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్, బాలానగర్ జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి , నవాబ్ పేట టీఆర్ఎస్ నేత రవీందర్ రెడ్డి జెడ్పీ రేసులో ఉన్నారు. వీరితో పాటు త్వరలో గులాబీ తీర్థం తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న ఎర్ర శేఖర్ కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం.
గతంలో ఉమ్మడి జిల్లాలో జెడ్పీపై గులాబీ జెండా ఎగరేసిన అధికార పార్టీ.. ప్రత్యేక మహబూబ్ నగర్ జిల్లాలో దానిని మరోసారి రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇందుకు వ్యూహరచనలు చేస్తోంది. జెడ్పీ పరిధిలోని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీ మెజార్టీలు సాధించడంతో.. స్థానిక ఎన్నికల్లోనూ ప్రజాతీర్పు ఏకపక్షంగా ఉంటుందని ఆ పార్టీ అధినాయకత్వం ధీమాతో ఉంది.
ప్రతిపక్షాలు కూడా స్థానిక సమరానికి సై అంటున్నాయి. అధికార పార్టీని ఢీకొట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్న ఆ పార్టీలు… ఉమ్మడి జిల్లా పరిధిలో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మొత్తంగా అన్ని పార్టీలు జెడ్పీ పీఠంపై గురిపెట్టడంతో ఈసారి గెలుపెవరిదన్న దానిపై చర్చ జోరందుకుంది.