US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్‌కు షాకిచ్చిన మరో పోల్ సర్వే.. హారిస్‌దే హవా

ప్రపంచం మొత్తం అమెరికా అధ్యక్ష ఎన్నికల వైపు చూస్తోంది. నవంబర్ నెలలో జరిగే ఈ ఎన్నికల్లో ట్రంప్, హారిస్ లలో ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.

kamala harris Donald Trump

Kamala Harris – Donald Trump: ప్రపంచం మొత్తం అమెరికా అధ్యక్ష ఎన్నికల వైపు చూస్తోంది. నవంబర్ నెలలో జరిగే ఈ ఎన్నికల్లో ట్రంప్, హారిస్ లలో ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అధ్యక్ష బరిలో నిలిచిన ఇరువురు నేతలు ప్రచారంలో నువ్వానేనా అన్నట్లు దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో వరుసగా వెల్లడవుతున్న పోల్ సర్వే ఫలితాలతో అధ్యక్ష ఎన్నికల్లో విజేతలెవరనే విషయంపై మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. అగ్రరాజ్యంలో వరుసగా వెల్లడవుతున్న సర్వే ఫలితాలు ట్రంప్ కు షాకిస్తున్నారు. అయితే, హారిస్, ట్రంప్ నకు విజయావకాశాల్లో కొద్దిశాతం మాత్రమే తేడా ఉండటం గమనార్హం. తాజాగా ప్రఖ్యాత ‘యూమాస్ లోవెల్స్ సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ యుగవ్’ సంస్థ విడుదల చేసిన పోల్ సర్వేలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి కమలాహారిస్ ముందంజలో ఉన్నట్లు తేలింది.

Also Read : US elections: ఎన్నికల వేళ అగ్రరాజ్యంలో కాల్పుల ఘటనలు.. మొన్న ట్రంప్.. నేడు కమలాహారిస్.. ఎందుకిలా?

◊  అరిజోనా, మిచిగాన్, పెన్సిల్వేనియా, జార్జియా వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో యూమాస్ లోవెల్స్ సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ యుగవ్ సంస్థ సర్వే నిర్వహించింది.
◊  మిచిగాన్ లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ నకు 43శాతం, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి హారిస్ కు 48శాతం మద్దతు లభించింది.
◊  జార్జియాలో కమలా హారిస్ కు ఏకంగా 51శాతం మద్దతు లభించగా.. ట్రంప్ కు 48శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు.
◊  పెన్సిల్వేనియాలో కమలా హారిస్ కు 48శాతం పబ్లిక్ మద్దతు తెలపగా.. ట్రంప్ కు 46శాతం మద్దతు లభించింది.
◊  అరిజోనాలో హారిస్ కు 48శాతం, ట్రంప్ నకు 51శాతం మంది మద్దతిస్తున్నారు.
◊  యూమస్ లోవెల్ పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ అసోసియేట్ డైరెక్టర్ రోడ్రిగో కాస్ట్రో కార్నెజో మాట్లాడుతూ.. మిచిగాన్ లో ట్రంప్ నకు ప్రతికూలత ఉండటం హారిస్ కు ప్రయోజనం చేకూర్చుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

◊  జాతీయ స్థాయిలో హారిస్ కంటే ట్రంప్ రెండు శాతం పాయింట్లతో వెనకంజలో ఉన్నారని కాస్ట్రో కార్నెజో పేర్కొన్నాడు.
◊  ఇటీవల రాయిటర్స్ – ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలోనూ ట్రంప్ కంటే కమల హారిస్ ముందంజలో ఉన్నారు.
◊  రాయిటర్స్ – ఇప్సోస్ సర్వేలో ట్రంప్ కు 40.48శాతం అనుకూలత రాగా.. కమలా హారిస్ కు 46.61 శాతం అనుకూల ఓట్లు వచ్చాయి.
◊  దేశవ్యాప్తంగా ట్రెండ్ ను అంచనా వేయడంలో కీలకంగా భావించే పోల్ సర్వేల్లో రాయిటర్స్ – ఇప్సోస్ సర్వే ఒకటి కావడం గమనార్హం.