తీరానికి కొట్టుకొచ్చిన 100 తిమింగలాలు.. రక్షించేందుకు గ్రామస్తుల పరుగులు

  • Publish Date - November 4, 2020 / 12:42 PM IST

Save 100 beached whales : శ్రీలంక నైరుతి సముద్ర తీర ప్రాంతంలో ఒడ్డుకు వందల సంఖ్యలో తిమింగలాలు కొట్టుకువచ్చాయి. ఒడ్డుకు చేరిన తిమింగళాలను కాపాడేందుకు లంక గ్రామస్తులతో పాటు నేవీ సిబ్బంది, పోలీసు బృందాలు, స్థానిక స్వచ్ఛంద సేవకులు బీచ్ దగ్గరకు చేరుకున్నారు.



ఒడ్డుకు చేరిన తిమింగలాను తిరిగి సముద్రంలోకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు కర్ఫ్యూ విధించినప్పటికీ కూడా పనదురలో తిమింగలాలను రక్షించేందుకు లంకవాసులంతా పరుగులు పెట్టారు. అలల తాకిడితో ఒడ్డుకు కొట్టుకువచ్చిన తిమింగలాలను తిరిగి సముద్రంలోకి నెట్టేందుకు చాలా కష్టంగా మారింది.



అలల తీవ్రత కారణంగా సముద్రంలోని నెట్టేసిన తిమింగలాలన్నీ తిరిగి మళ్లీ ఒడ్డుకు వస్తున్నాయి. తిమింగలాలను సముద్రం లోపలికి పంపేందుకు అక్కడి వారంతా తీవ్రంగా శ్రమించారు. ఎందుకిలా తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకుని వస్తున్నాయి అనేదానిపై స్పష్టత లేదు.పైలట్ తిమింగిలాలు ఎప్పుడు గుంపుగా కదులుతుంటాయి. తిమింగలాల గుంపులో ఏదైనా ఒక తిమింగలం ఒడ్డుకు చేరితే మిగతావన్నీ కూడా అదే బాటలో ముందుకు కొనసాగుతుంటాయి.



లంక ద్వీపంలోని పనదురలో అతిపెద్ద తిమింగలాల గుంపు ఒడ్డుకు చేరుకుందని లంక Marine Environment Protection Authority (MEPA) ధ్రువీకరించింది.

అతిపెద్ద సంఖ్యలో తీరానికి తిమింగలాలు చేరడం చాలా అసాధారణమని MEPA చీఫ్ దర్శని లహందాపుర తెలిపారు.



దీనికి కారణం ఏంటో తెలియదన్నారు. ఇప్పటికే చాలా తిమింగలాలను ఒడ్డు నుంచి సముద్రంలోకి పుష్ చేశామని, ఎందుకిలా జరుగుతుందో తెలియడం లేదన్నారు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదని, ఇదే తొలిసారిగా చూశామని మత్స్యకారులు చెబుతున్నారు.