ఓ మహిళా ప్లేయర్ తన బిడ్డకు పాలిస్తూ వాలీబాల్ గేమ్ ఆడిన ఫోటో వైరల్ గా మారింది. మిజోరం స్టేట్ గేమ్స్ 2019 క్రీడలు కొనసాగుతున్నాయి. ఈ క్రీడల్లో అరుదైన దృశ్యానికి వేదికైంది. టుయికుమ్ వాలీబాల్ టీమ్‌లో లాల్వెంట్లూంగి అనే మహిళా ప్లేయర్‌కు ఏడు నెలల పసిబిడ్డ ఉంది. ఆటలో విజయం సాధించాలన్న తపన ఒకవైపు.. మరోవైపు తల్లిగా తన బిడ్డ ఆకలిని తీర్చాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసంది ఈ అమ్మ.
పాల కోసం ఏడుస్తున్న బిడ్డ ఆకల్ని తీర్చింది. ఆట మధ్యలోనే బిడ్డకు స్తన్యం ఇచ్చింది. బిడ్డ చిట్టిపొట్టను నింపింది. అటు బిడ్డపై ఉన్న అమ్మప్రేమను, ఇటు ఆట పట్ల తనకున్న బాధ్యతను ఒకేసమయంలో న్యాయం చేసింది. ఆట విరామ సమయంలో బిడ్డకు పాలిస్తున్న లాల్వెంట్లూంగి ఫోటోలు నెటిజన్స్ హృదయాలను గెలుచుకుంది.
లాల్వెంట్లూంగి తనబిడ్డకు పాలిచ్చిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెకు ఆటపై ఉన్న బాధ్యత..ఇష్టం..చిత్తశుద్ది..మరోపక్క బిడ్డ ఆకలిని తీర్చటంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫోటోను చూసి మిజోరం క్రీడల శాఖ మంత్రి రాబర్ట్ రోమవియా.. లాల్వెంట్లూంగిను ప్రశంసించారు. ఆమెకు రూ. 10 వేల నగదును అవార్డుగా ప్రకటించారు క్రీడల శాఖ మంత్రి.
భార్యగా..తల్లిగా..చెల్లిగా అన్ని పాత్రలనే కాక..ఉద్యోగినిగా కూడా రాణిస్తున్న మహిళలు అన్ని రంగాల్లోను తమదైన ముద్ర వేసుకుంటున్నారు. అన్ని బాధ్యల్ని సమన్వయం చేసుకుంటు కెరీర్ లో కూడా దూసుకుపోతున్నారు. ఓ మహిళ ఎంత స్థాయికి వెళ్లినా తనలోని అమ్మతనాన్ని మాత్రం మరచిపోదు. బిడ్డ ఏడవకముందే బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది. బిడ్డ ఆకలి తీర్చటం కంటే ఏదీ ముఖ్యం కాదనుకుంటుంది. దానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఫోటో. అమ్మతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి అమ్మలకు హ్యాట్సాఫ్..హ్యాట్సాఫ్…హ్యాట్సాఫ్..