నిద్ర పోకుండా ఉండడం అనేది ఈరోజుల్లో సర్వ సాధారణం అయిపోయింది.. తక్కువగా నిద్రపోవడం.. ఫోన్‌లను ఎక్కువగా చూడడం ఇప్పుడు సమాజంలో పెద్ద సమస్య. నిద్రపోకపోతే ఏమవుతుంది ? సరైన నిద్ర లేకపోతే జీవితం తల క్రిందులవుతుందా? నిద్ర లేకపోతేనే అల్జీమర్స్ వ్యాధి సోకుతుందా? మన సొంత వాళ్ళనే మనం మర్చిపోతామా? నిద్ర వల్ల ఎంత ప్రమాదం ఉందో? చెప్పే అధ్యయనాలు ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఒక్క రోజు సరిగా నిద్రపోకపోయినా ఆరోగ్యం నీరసించిపోతుంది. పలు వ్యాధుల బారినపడే అవకాశం ఉంటుంది. ఒక అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం.. ఒక్కరోజు నిద్రలేకపోతే శరీరంలో అత్యధిక మోతాదులో విషతుల్యమైన ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు.. ప్రతీరోజూ కనీసం ఐదు గంటలు నిద్ర లేకపోతే.. మతిమరపు(అల్జీమర్స్) అనే దీర్ఘకాలిక న్యూరోడీజెనరేటివ్ వ్యాధి బారిన పడే అవకాశముంది.
సరైన సమయం కంటే ఎక్కువగా నిద్రపోని కారణంగా, శరీరంలో బీటా ఎమోలాయిడ్ ప్రొటీన్ ఐదుశాతం పెరిగిందని, సాధారణ వ్యక్తులతో పోల్చిచూస్తే మతిమరపు కలిగిన వ్యక్తుల్లో బీటా ఎమోలాయిడ్ ప్రొటీన్ 21 శాతం అధికంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరానికి సరిపడినంత నిద్రపోవడం వలన బీటా ఎమోలాయిడ్ ప్రొటీన్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది. అప్పుడే మెదడు సక్రమంగా పనిచేస్తుంది. తక్కువ సమయం నిద్రపోయేవారిలో బీటా ఎమోలాయిడ్ ప్రొటీన్ స్థాయి పెరిగిపోయి అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుంది.
సుమారు 70 ఏళ్లు పైబడిన తర్వాత మెదడు పనితీరు తగ్గడం వలన చాలామందిలో అల్జీమర్స్ సమస్య తలెత్తుతుంది. అయితే సరైన నిద్ర లేకపోతే 50 నుంచి 60 ఏళ్ల వయసులోనే అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవితకాలంలో సరిపడినంత నిద్ర అందకపోవడం వలన అది మెదడులోని ప్రొటీన్లపై ప్రభావం చూపి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్లుగా లేటెస్ట్‌గా అధ్యయానాల్లో వెల్లడైంది.
అంతేకాదు.. ఎక్కువగా నిద్ర లేకపోవడం వల్ల శరీరానికి ఒత్తిడి పెరిగిపోయి సంతాన సమస్యలు వస్తున్నాయి. శరీరం బరువు పెరిగిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. కాలంతో పాటు మనుషుల జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు నిద్ర తక్కువగా పోవడానికి కారణం కాగా.. ఎక్కువ మంది రాత్రుళ్లు మొబైల్‌ఫోన్‌లు చూసుకుంటూ నిద్రపోవాలన్న సంగతే మర్చిపోతున్నారు. మొబైల్‌ఫోన్ వెలుతురు కూడా నిద్రలేమి సమస్యకు ఓ కారణం.. తెరపై కనిపించే తెల్లని, బులుగు రంగు వెలుగు మెదడులో మెలటోనిన్ అనే హర్మోన్‌ను విడుదల చేయకుండా నిలువరిస్తుంది. కారణంగా నిద్రపట్టదు. కాబట్టి నిద్రపోయే ముందు ఫోన్‌లు పక్కన పెట్టకుంటే ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.