Weather Updates: మరో 3 గంటల్లో ఏపీలో భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంది. ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలంది.

  • Published On : March 21, 2026 / 04:42 PM IST

Weather Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. హాట్ సమ్మర్ లో వానలు దంచి కొడుతున్నాయి. వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులతో కూడిన వానలు ప్రజలను, రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఎండా కాలంలో కురుస్తున్న ఈ అకాల వానలు వాతావరణాన్ని కొంత కూల్ చేస్తున్నా.. ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వానలు రైతులను నిండా ముంచుతున్నాయి. పంట పొలాలు నీట మునిగి భారీ నష్టం వాటిల్లుతోంది.

మరోవైపు రాగల గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంది. ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలంది. వెంటనే సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

అటు విజయవాడలో వర్షం దంచికొట్టింది. పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అయోధ్య నగర్, సత్యనారాయణపురం, అజిత్ సింగ్ నగర్, పాయికాపురం, కండ్రిక, రాజీవ్ నగర్, సహా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. నున్న, అంబాపురం, మైలవరం, నందిగామ, కంచికచర్లలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. అకాల వానలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వానలతో కోత దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. మొక్కజొన్న, మినుము, మామిడి, పెసర పంటలు దెబ్బతినే అవకాశం ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ యాప్ మస్ట్? ప్రభుత్వ ప్లాన్‌కు ఆపిల్, శాంసంగ్ షాకింగ్ రియాక్షన్!