Aadhaar App : ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ యాప్ మస్ట్? ప్రభుత్వ ప్లాన్‌కు ఆపిల్, శాంసంగ్ షాకింగ్ రియాక్షన్!
Aadhaar App : భారత మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ యాప్ ప్రీ ఇన్ స్టాల్ అయి ఉండాలని ప్రభుత్వ ప్రతిపాదనకు ఆపిల్, శాంసంగ్ కంపెనీలు నో చెప్పేశాయి.. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..
Aadhaar App
- భారత మార్కెట్లోకి రాబోయే ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ యాప్ ఉండాల్సిందే
- ఆధార్ యాప్ ప్రీ-ఇన్ స్టాల్ అయి ఉండేలా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన
- ప్రభుత్వ ప్లాన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన ఆపిల్, శాంసంగ్ కంపెనీలు
Aadhaar App : ఆధార్ యాప్.. ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ఈ ఆధార్ యాప్ ప్రతి భారత పౌరుడికి ఎంతో అవసరం. ఇలాంటి ఆధార్ యాప్ అందరికి అందుబాటులో ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఒక సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది.
ఇకపై భారత మార్కెట్లో అమ్మే ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ యాప్ ప్రీ-ఇన్స్టాల్ చేసి (డిఫాల్ట్)గా ఉండాలని కోరింది. అంటే.. మనం ఫోన్ కొనగానే క్లాక్, కాలిక్యులేటర్ ఎలా ప్రీ-ఇన్ స్టాల్ అయి ఉంటాయో అలాగే ఆధార్ యాప్ కూడా ప్రీ-ఇన్ స్టాల్ అయి ఉంటుంది అనమాట. ప్రత్యేకించి ఈ యాప్ మాన్యువల్ గా ప్లే స్టోర్ నుంచి ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు.
ముందుగానే ఫోన్లలో యాప్ ఉంటే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, ఆపిల్, శాంసంగ్, గూగుల్ వంటి పెద్ద స్మార్ట్‌ఫోన్ మేకర్లు ప్రభుత్వ ఆలోచనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మేం తయారు చేసే మా స్మార్ట్‌ఫోన్‌లో ఏయే యాప్‌లు ఉండాలి? ఉండకూడదు అనే నిర్ణయం కంపెనీలదే కావాలని బల్లగుద్దిమరి చెబుతున్నాయి.
సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఇప్పటికే సంచార్ సాథీ యాప్ విషయంలోనూ వచ్చింది. అప్పుడూ ఇదే స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇలాగే వ్యతిరికేంచాయి. మొత్తానికి, ఈ ప్రభుత్వ ప్రతిపాదన నిజంగా అమల్లోకి వస్తుందా? లేదా కంపెనీల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఇంకా ఏమైనా మార్పులు చేస్తారా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
స్మార్ట్‌ఫోన్ మేకర్లు ఎందుకు వ్యతిరేకించారంటే? :
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MAIT) వ్యతిరేకించిందని నివేదిక పేర్కొంది. ఆపిల్, శాంసంగ్ వంటి స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలు భద్రత, గోప్యతపై ఆందోళనలు వ్యక్తం చేసినట్లు సమాచారం. 2025లో సంచార్ సాథీ ప్రతిపాదన సమయంలో కూడా ఇలాంటి సమస్యలనే లేవనెత్తారు.
ఆధార్ యాప్‌ను ప్రీ-ఇన్స్టాల్ చేస్తే దేశీయ మార్కెట్లో విక్రయించాలనుకుంటున్న స్మార్ట్ఫోన్ల కోసం కంపెనీలు ప్రత్యేక ప్రొడక్టు లైన్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని MAIT లేవనెత్తినట్లు సమాచారం.
దీనికారణంగా లాజిస్టికల్ సమస్యలు కూడా తలెత్తవచ్చు. దీనికి సంబంధించి జనవరి 13న ఒక ఇంటర్నల్ ఈమెయిల్ కూడా పంపింది. అందులో ఈ ప్రతిపాదన వల్ల ఎక్కువ ప్రజా ప్రయోజనాన్ని చేకూర్చదని MIAT పేర్కొంది.
స్మార్ట్ఫోన్లలో ఆధార్ యాప్ ఎందుకు ఉండాలి? :
2026 ఏడాది జనవరిలో ఆధార్ యాప్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ ఆధార్ యాప్ ద్వారా దేశీ పౌరులంతా తమ వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో మార్చుకోవచ్చు. అవసరమైతే అప్డేట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ప్రొఫైల్‌లు మెయింటైన్స్ చేయొచ్చు.
ఆధార్ దుర్వినియోగాన్ని నివారించేందుకు బయోమెట్రిక్ డేటాను లాక్ చేసేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకారం.. ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ప్రీ-ఇన్ స్టాలేషన్ ఉండటం ద్వారా యాప్ ప్రత్యేకించి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆధార్ ఫీచర్లను వినియోగించుకోవచ్చు అనమాట.
ఆధార్ అంటే ఏంటి? :
ఆధార్ అనేది వినియోగదారుని బయోమెట్రిక్ డేటాతో నేరుగా లింక్ అయిన 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. 134 కోట్లకు పైగా భారతీయ నివాసితులు ఆధార్ డేటాలో రిజిస్టర్ చేసుకున్నారు. బ్యాంకింగ్, టెలికాం, ఎయిర్ పోర్టులో ఎంట్రీ కోసం ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డును ఎక్కువగా అవసరం పడుతుంది.
గత కొన్ని ఏళ్లలో లక్షలాది మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బహిర్గతమయ్యేలా ఆధార్ డేటా లీక్‌ల కేసులు వెలుగులోకి వచ్చాయి. దీని కారణంగానే ప్రజల ఆధార్ వివరాలను భద్రపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు వెనక్కి తగ్గుతాయా? లేదా ప్రభుత్వమే ఆలోచన మార్చుకుంటుందా? అనేది వేచి చూడాలి.
