పొగమంచు అలర్ట్ : 3 రోజులు జాగ్రత్త

తెలుగు రాష్ట్రాలను పొగమంచు పట్టుకుంది. దట్టమైన పొగమంచు ముంచెత్తుతోంది. సాయంత్రం నుంచి సూర్యోదయం వరకు దట్టంగా అలముకుంటోంది. ఇన్నాళ్లూ ఏజెన్సీ ప్రాంతాల్లోనే పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండేది. మారిన వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోనూ దాని తీవ్రత అధికమవుతోంది.

నాలుగు రోజుల నుంచి తూర్పు గాలులు వీయడం మొదలయ్యాయని, దీంతో ఉపరితలానికి కిలోమీటర్ ఎత్తులో ఉష్ణోగ్రతలు తగ్గడానికి బదులు పెరుగుతున్నాయని, దీనివల్ల నీటి ఆవిరి పైకి వెళ్లకుండా ఉపరితలంపైనే ఉండిపోయి పొగమంచు ఏర్పడుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అదే సమయంలో బలమైన గాలులు కూడా లేకపోవడం ఈ పరిస్థితికి కారణమన్నారు. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలో పొగమంచు ఎక్కువగా కురుస్తుందని వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు.

హైదరాబాద్‌లోనూ పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది. 2019, జనవరి 17వ తేదీ వరకు రాత్రి నుంచి ఉదయం 10 గంటల వరకు నగరంలో పొగమంచు తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి చెప్పారు. ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లో 2019, జనవరి 13వ తేదీ ఆదివారం 29.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవగా 17.5 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ అదనం.

పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలను కూడా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల బారిన పడుతున్నారు. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పొగమంచు వల్ల ప్రజలు జలుబు, తలనొప్పి, గొంతు, శ్వాసకోశ వ్యాధుల బారినపడే అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు పొగమంచు బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు