AP Weather: ఇటు ఎండలు, అటు పిడుగుల వానలు.. ఏపీలో రేపు కూడా ఇంతే.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త

ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ దగ్గర నిలబడొద్దని హెచ్చరించింది.

  • Published on- May 31, 2026 / 05:56 PM IST

AP Weather: ఏపీలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు వానలు పడుతున్నాయి. సోమవారం కూడా మిశ్రమ వాతావరణం ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు, ఎండల ప్రభావం కొనసాగింపు ఉంటుందని అంచనా వేసింది. విదర్భ నుంచి ఉత్తరాంధ్ర మీదుగా ద్రోణి విస్తరణ, బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వానలు కురుస్తాయని తెలిపింది.

సోమవారం అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు వర్ష సూచన చేసింది. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ దగ్గర నిలబడొద్దని హెచ్చరించింది. పంట పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇక, జూన్ 1న పలు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంది. పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డ్ అవనున్నాయి. ఆదివారం పల్నాడు జిల్లా అచ్చంపేటలో 44.3 డిగ్రీల గరిష్ఠ టెంపరేచర్ రికార్డ్ అయ్యింది. నెల్లూరు జిల్లా కావలిలో 43.9 డిగ్రీలు.. ఉయ్యూరు, నందిగామలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు, పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచన చేసింది.

Also Read: తల్లికి వందనం.. కీలక ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం.. డబ్బులు పడేది అప్పుడే..