Hot Summer: బీకేర్ ఫుల్.. ఈ సమయంలో అస్సలు బయటకు రావొద్దు..! ఏపీ ప్రజలకు హెచ్చరిక..

ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. పల్నాడు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో అధిక ప్రభావం ఉండనుంది.

  • Updated on- April 14, 2026 / 09:10 PM IST

Hot Summer: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. సూర్యుడి భగభగలతో జనం విలవిలలాడిపోతున్నారు. ఓవైపు ఎండతీవ్రత, మరోవైపు వడగాలులు.. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. వేసవి తాపంతో హాహాకారాలు చేస్తున్నారు.

కాగా, రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత పెరగనుంది. ఉష్ణోగ్రతలు సైతం పెరగనున్నాయి. ఈ మేరకు హెచ్చరిక జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. రేపు రాయలసీమ, కోస్తాలో 42 నుంచి 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 46 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. 73 మండలాల్లో సాధారణ వడగాలుల హెచ్చరిక జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. పల్నాడు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో అధిక ప్రభావం ఉండనుంది.

అటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కడప ఒంటిమిట్టలో ఏకంగా 45°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 262 మండలాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44°C దాటాయి. ప్రజలు ఎండ, ఉక్కపోత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. తగిన జాగ్రత్తలు తీసుకోవాలంది. ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని, ఎండలో తిరగొద్దని సూచించింది. మరీ ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన చేసింది.

ఏవైనా పనులు ఉంటే ఉదయం 10 గంటలలోపు ముగించుకుని ఇంటి దగ్గరే ఉండటం మంచిదంటున్నారు అధికారులు. లేదా సాయంత్రం 4 గంటల తర్వాత పనులు ఉంటే చూసుకోవాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో తిరగాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. టోపీ ధరించడం, గొడుగు వాడటం వంటివి చేయాలి. ఎండ నేరుగా మన మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినంత నీరు తీసుకోవాలని సూచించారు.

Also Read: ఏపీలో నవశకం.. అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు