×
Ad

మరో రెండు రోజులు కుమ్ముడే.. తెలంగాణలో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ

హైదరాబాద్ లోనూ భారీ వాన పడే అవకాశం ఉందని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.

  • Published On : July 11, 2024 / 06:29 PM IST

Telangana Rains : తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు సముద్రమట్టానికి 3 కిలోమీటర్ల నుంచి ఏడున్నర కిలోమీటర్ల మధ్యలో ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం అధికారి వెల్లడించారు. ఏపీ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని కేంద్రీకృతమైన ఆవర్తనం బలహీన పడిందని, దీని ప్రభావంతో తెలంగాణలోని 10 జిల్లాల్లో భారీ వానలు పడతాయని తెలిపారు.

మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతుల అప్రమత్తంగా ఉండాలన్నారు.

హైదరాబాద్ లోనూ భారీ వాన పడే అవకాశం ఉందని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. ఇక.. 14, 15 తేదీల్లో హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో బుధవారం అత్యధికంగా 6.40 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Also Read : మళ్లీ టీడీపీ గూటికి? అసలు మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటి, ఎందుకు చంద్రబాబు వైపు చూస్తున్నారు?