Weather Updates: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇటు ఎండలు, అటు పిడుగుల వానలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..!

ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశుకాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదని హెచ్చరించారు. సురక్షితమైన ప్రదేశాల్లోనే తల దాచుకోవాలన్నారు.

  • Published On : April 8, 2026 / 06:35 PM IST
  • గురువారం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు
  • మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు
  • రాయలసీమ జిల్లాల్లో దంచికొట్టనున్న ఎండలు

Weather Updates: ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అదే సమయంలో అకాల వర్షాలు పడుతున్నాయి. పిడుగులతో కూడిన వానలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది.

రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపధ్యంలో ఎండతీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోందని తెలిపారు. దీని ప్రభావంతో గురువారం (09-04-26) కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశుకాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదని హెచ్చరించారు. సురక్షితమైన ప్రదేశాల్లోనే తల దాచుకోవాలన్నారు.

బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి తూర్పుగోదావరి (జి) పైడిమెట్టలో 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ (జి) డి.పోలవరంలో 37.7 మిమీ, తూర్పుగోదావరి (జి) సీతానగరంలో 32.2 మిమీ, అనకాపల్లి (జి) పాయకరావుపేటలో 26 మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు.

మరోవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

బుధవారం పల్నాడు (జి) క్రోసూరు, తిరుపతి (జి) వరదయ్యపాలెంలో 42.2°C, చిత్తూరు (జి) నగరిలో 42.1°C, నంద్యాల (జి) చాగలమర్రిలో 41.9°C, కడప (జి) పులివెందులలో 41.8°C, అనంతపురం (జి) తెరన్నపల్లిలో 41.7°C, కర్నూలు (జి) తోవి, మార్కాపురం (జి) అనుములపల్లెలో 41.6°C, ప్రకాశం (జి) చెరువుకొమ్ముపాలెంలో 41.5°C చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

Also Read: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 10 నుంచి టోల్‌ గేట్ల వద్ద దాటాలంటే అవి ఉండాల్సిందే..!