వచ్చేస్తోంది.. వారంలోనే కరోనా వ్యాక్సిన్..జనవరి 11న తొలి టీకా?

వచ్చేస్తోంది.. వారంలోనే కరోనా వ్యాక్సిన్..జనవరి 11న తొలి టీకా?

Explained: What next for Covid-19 vaccine rollout in India? దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తూ ఉన్నారు ప్రజలు.. ఇప్పటికే కోవిడ్-19 వ్యాక్సిన్ అనుమతులు కేంద్రం ఇవ్వగా.. రాబోయే వారం రోజుల్లోనే కరోనా వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్రం నుంచి ఇప్పటికే ఈమేరకు సంకేతాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా అందుకు సంబంధించిన ప్రకటన వెలువడలేదు.

కేంద్రం నుంచి ఇప్పటికే వచ్చిన సంకేతాల మేరకు జనవరి 11వ తేదీన దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉండగా.. అదేరోజు తెలంగాణలో కూడా తొలి వ్యాక్సిన్ పడే అవకాశం ఉంది. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత.. ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు వెయ్యనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్‌ టీకా, భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ టీకాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర అనుమతులు ఇవ్వగా.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు వైద్య అధికారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రానికి ముందుగా 10 లక్షల డోసుల కరోనా టీకాలు రానుండగా.. మొదటి విడతలో వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు కోవిషీల్డ్‌ టీకా ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ముందుగా రాష్ట్రంలో 2.88 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి టీకా అందనుంది.

ఒక్కో వ్యక్తికి ఒక్కో సమయం కేటాయించి ఆ ప్రకారం వారి మొబైల్‌ ఫోన్లకు టైం స్లాట్‌ మెసేజ్‌లు పంపిస్తారు. ఆ టైమ్ స్లాట్ ప్రకారమే టీకా వేయించుకునేందుకు రావలసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వారికి కేటాయించిన రోజు రాకపోతే ప్రత్యేకంగా మరో రోజు కేటాయిస్తారు. ఎవరైనా వేయించుకోకూడదని నిర్ణయించుకుంటే ఒత్తిడి చేయరు. వ్యాక్సిన్ వేసుకోవాలా? వద్దా? అనేది స్వచ్ఛంద నిర్ణయమే. రెండు వారాల్లో వైద్య సిబ్బందికి ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. వారంలో నాలుగు రోజులు మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతుంది. బుధ, శని, ఆదివారాల్లో వ్యాక్సిన్ వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.

రెండు వారాలు వైద్య సిబ్బందికి టీకా వేశాక… మూడు లేదా నాలుగో వారంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా వేస్తారు. పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూకు సంబంధించిన నిర్ణీత సిబ్బంది, పోలీసులు వంటి ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల జాబితా ఇంకా తయారుకాలేదు. వారి జాబితాను ఆయా శాఖలు తయారు చేసి కేంద్రానికి పంపించిన తర్వాత, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు వారికి టీకాలు వేస్తారు. 50 ఏళ్లు పైబడిన వారికి, 50 ఏళ్లలోపు అనారోగ్యంతో బాధపడే వారికి ఎప్పుడు టీకా వేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.