IPL 2024 : చెన్నైకి తప్పని ఓటమి.. 35 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం

IPL 2024 - CSK vs GT : గుజరాత్ నిర్దేశించిన 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులకే సీఎస్‌కే పరాజయం పాలైంది.

IPL 2024 : చెన్నైకి తప్పని ఓటమి.. 35 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం

IPL 2024 _ CSK vs GT ( Image Credit : @IPL/Twitter )

IPL 2024 – CSK vs GT : ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆసక్తికర పోరులో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులకే సీఎస్‌కే పరాజయం పాలైంది.

హాఫ్ సెంచరీలతో మెరిసిన మిచెల్, మెయిన్ అలీ :
చెన్నై ఆటగాళ్లలో డారిల్ మిచెల్ (63; 34 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్స్), మెయిన్ అలీ (56; 36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్) హాఫ్ సెంచరీలతో విజృంభించారు. మోహిత్ శర్మ బౌలింగ్‌లో షాట్ ఆడిన మిచెల్.. షారూక్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా, మెయిన్ అలీ కూడా నూర్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. శివమ్ ధూబే (21) పరుగులతో రాణించగా, ఓపెనర్ అజింక్య రహానే (1), రచిన్ రవీంద్ర (1) పేలవ ప్రదర్శనతో చేతులేత్తేశారు. రుత్‌రాజ్ గైక్వాడ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు.

ధోని ఖాతాలో 250 సిక్స్‌లు :
మిగతా ఆటగాళ్లలో రవీంద్ర జడేజా (18) పరుగులకే పరిమితం అయ్యాడు. ఎంఎస్ ధోని (26 నాటౌట్), శార్దూల్ ఠాకూర్ (3) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ ఏకంగా 3 వికెట్లు తీసుకోగా, రషీద్ ఖాన్ 2 వికెట్లు, ఉమేష్ యాదవ్, సందీప్ వారియర్ తలో వికెట్ తీసుకున్నారు. ఇదిలా ఉండగా, ఐపీఎల్‌ అన్ని సీజన్లతో కలిపి ఎంఎస్ ధోనీ మొత్తం 250 సిక్స్‌లను పూర్తి చేశాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ధోని ఈ ఫీట్ సాధించాడు.

సెంచరీలతో చెలరేగిన గిల్, సుదర్శన్ :
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టు చెన్నైకి 232 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్ ఓపెనర్లలో సాయి సుదర్శన్ (103; 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (104; 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్) సెంచరీతో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరే గుజరాత్ జట్టుకు భారీ స్కోరు రాబట్టారు.

మిగతా ఆటగాళ్లలో డేవిడ్ మిల్లర్ (16; నాటౌట్), షారూఖ్ ఖాన్ (2) పరుగులకే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 2 వికెట్లు పడగొట్టాడు. అద్భుత సెంచరీతో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన శుభమన్ గిల్ (104)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

టాప్ 4లో చెన్నై :
పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 6 ఓడి మొత్తం 12 పాయింట్లతో టాప్ 4 స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 7 ఓడి మొత్తం 10 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానం నుంచి 8వ స్థానంలోకి ఎగబాకింది.

Read Also : ఏం బ్యాటింగ్ భయ్యా.. ఓపెనర్లుగా దిగి సెంచరీలు బాదిన శుభ్‌మన్ గిల్, సుదర్శన్