Cm Revanth Reddy : తెలంగాణ సమాజానికి ఆ పార్టీ అత్యంత ప్రమాదకరం, ఒక్క సీటు కూడా గెలవకూడదు- సీఎం రేవంత్

ప్రజాస్వామ్యాన్ని కాపాడి, ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలన్నదే కాంగ్రెస్ విధానం. తెలంగాణలో ఒక వ్యక్తి, ఒక కుటుంబం పాలనను ప్రజలు తిరస్కరించారు.

Cm Revanth Reddy : తెలంగాణ సమాజానికి ఆ పార్టీ అత్యంత ప్రమాదకరం, ఒక్క సీటు కూడా గెలవకూడదు- సీఎం రేవంత్

Cm Revanth Reddy : మీట్ ద ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో ఎన్నికలు అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో జరిగేవని.. ఈసారి మాత్రం రాజ్యాన్ని మార్చాలా? రిజర్వేషన్లు రద్దు చేయాలా? వద్దా? అన్నదానిపై ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు. ఇండియా కూటమికి భారత రాజ్యాంగమే ఖురాన్, బైబిల్, భగవద్గీత అని ఆయన స్పష్టం చేశారు. భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు గౌరవిస్తూ.. సరలీకృత ఆర్థిక విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసిందని సీఎం రేవంత్ వివరించారు.

”దేశంలో సంస్థలను, వ్యవస్థలను ఎన్డీయే ప్రభుత్వం చెరబట్టింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడి, ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలన్నదే కాంగ్రెస్ విధానం. తెలంగాణలో ఒక వ్యక్తి, ఒక కుటుంబం పాలనను ప్రజలు తిరస్కరించారు. రాజకీయ బేరసారాల్లో భాగంగా రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. మతాలు, వ్యక్తుల మధ్య, సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతోంది బీజేపీ. అందుకే యూపీలో పెట్టుబడులు రావడం లేదు.

హైదరాబాద్ విశ్వనగంగా మారుతుంది. బీజేపీ చేతిలోకి వెళితే.. సమాజం నిట్టనిలువుగా చీలిపోతుంది. ఓట్ల కోసం మోదీ.. ప్రజల్లో విద్వేషాలు నింపి.. ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. నియోజకవర్గాలనే విభజన కత్తి దక్షిణ భారతంపై వేలాడుతోంది. జనాభా లెక్కన చేస్తే.. మన ఉనికికే ప్రమాదం ఉంది. బీజేపీ పాలనలో.. ఉత్తర, దక్షిణ మధ్య సమతుల్యత లోపించింది. ప్రజలు చైతన్యంగా ఓటేయండి. సామాజిక బాధ్యతగా ఓటింగ్ లో పాల్గొనండి. వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న ఎన్డీయే కూటమిని ఓడించండి” అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

”నూటికి నూరు శాతం తెలంగాణ సమాజానికి బీజేపీ అత్యంత ప్రమాదకరంగా కానుంది. ఇది రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని చెప్పడం లేదు. తెలంగాణలోని వర్గాల సమీకరణలు దృష్టిలో పెట్టుకుని చెబుతున్నా. బీజేపీ ఒక్కసారి తెలంగాణలో వేళ్లూనుకున్నదంటే.. ఇక ఇక్కడ శాంతి అనేది మర్చిపోవాల్సిందే. అధికారాన్ని నిలుపుకోవడం కోసం కచ్చితంగా జాతులు, తెగలు, మతాల మధ్య పంచాయితీలు పెట్టి.. ఇక్కడున్న అభివృద్ధిని, ఇక్కడ జరుగుతున్న సంక్షేమాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. అందుకు ఉదాహరణ ఉత్తరప్రదేశ్.

ఢిల్లీ పార్లమెంట్ హౌస్ నుంచి కేవలం 25 మినిట్స్ వాక్ అవేలో ఉన్న నోయిడాకు ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రావడం లేదు. దానికి కారణం మతాలు, జాతులు, మనుషుల మధ్య మత ప్రాతిపదికన చిచ్చు పెట్టి అధికారాన్ని నిలుబెట్టుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలే. ఇది శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. లా అండ్ ఆర్డర్ లేని దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎవరూ పెట్టుబడులు పెట్టరు. పెట్టుబడులు రాకుంటే ఉద్యోగాలు రావు, ఉపాధి దొరకదు, రాష్ట్ర ఆదాయం పెరగదు.

కాబట్టి, తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే.. తెలంగాణలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవకూడదు అనేది మా విధానం. తెలంగాణ విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నేనీ మాట చెబుతున్నా. తెలంగాణకు బీజేపీ అనేది క్యాన్సర్ లాంటిది. దాన్ని పూర్తిగా తొలగించాల్సిన అవసరం మనందరి మీద ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో అనేకసార్లు బాంబు పేలుళ్లు జరిగాయి- ప్రధాని మోదీ