Konda Surekha: నిర్ణయం వాళ్లకే వదిలేశా..! మీనాక్షి నటరాజన్‌తో భేటీ తర్వాత మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు..

నా ఆలోచనలు, నా ఇబ్బందులు పీసీసీ చీఫ్, పార్టీ ఇంఛార్జ్ తో చెప్పాను. పార్టీ పెద్దలు కూర్చుని మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు

Konda Surekha: నిర్ణయం వాళ్లకే వదిలేశా..! మీనాక్షి నటరాజన్‌తో భేటీ తర్వాత మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు..

Konda Surekha

Updated On : October 16, 2025 / 9:26 PM IST

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండా సురేఖ భేటీ ముగిసింది. ఈ భేటీ అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్ణయం వాళ్లకే వదిలేశాం అని చెప్పారు. మా పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయ్యామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇప్పుడు చోటు చేసుకున్న అంశంలో పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని వారు చెప్పారని అన్నారు. పార్టీ పెద్దలు సెటిల్ చేస్తా అన్నారు, భారం వాళ్ళకి వదిలేసి వెళ్తున్నా అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు.

”నా ఆలోచనలు, నా ఇబ్బందులు పీసీసీ చీఫ్, పార్టీ ఇంఛార్జ్ తో చెప్పాను. పార్టీ పెద్దలు కూర్చుని మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జరిగిన విషయాలన్నింటిని ఇంఛార్జ్ దృష్టికి తెచ్చాను. నేను చెప్పాల్సింది చెప్పా. భారం అంతా పార్టీ పెద్దలపై ఉంచాను. విచారణ చేసి త్వరలో నిర్ణయం చెప్తామని ఇంఛార్జ్ చెప్పారు. పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు ఇచ్చే ఆదేశాలను పాటిస్తాను” అని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.

ఓఎస్డీ సుమంత్ వివాదంలో ప్రభుత్వంపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన బహిరంగ విమర్శలు కాంగ్రెస్ లో దుమారం రేపాయి. బీసీలను అణగదొక్కేందుకు రెడ్లు ఒక్కటయ్యారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. దీన్ని పార్టీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై చర్చించేందుకు రావాలని కొండా సురేఖకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు.

మీనాక్షి ఫోన్ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు చేరుకున్నారు. అక్కడ మీనాక్షి నటరాజన్ తో సమావేశమయ్యారు. ఈ వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుందా.. పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.

హైద‌రాబాద్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద బుధవారం రాత్రి హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ను ప్రభుత్వం తొలగించింది. బుధవారం రాత్రి సుమంత్ ను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన టాస్క్ ఫోర్స్ పోలీసులను కొండా సురేఖ కూతురు సుస్మిత అడ్డుకున్నారు. అంతేకాదు వారితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు.

తరుచూ వివాదాల్లో మంత్రి కొండా సురేఖ..

ఈ క్రమంలో ప్రభుత్వంలోని పలు నేతలు టార్గెట్ గా సుస్మిత చేసిన బహిరంగ ఆరోపణలు సొంత పార్టీలో దుమారం రేపాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మంత్రి సురేఖకు ఫోన్ చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని చెప్పినట్టు సమాచారం. మీనాక్షి నటరాజన్ తో భేటీ తర్వాత.. కొండా సురేఖ ఎసిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. తరచూ వివాదాల్లో నిలుస్తూ పార్టీని ఇరకాటంలో పెడుతున్నారని, దీంతో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉందని పార్టీ నేతలే అనుకుంటున్నారు.

Also Read: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సుమంత్ పేరు.. ఎవరీ సుమంత్? ఏంటీ అసలు గొడవ?.. ఫుల్ డిటెయిల్స్