Nellore TDP: నెల్లూరు తెలుగు తమ్ముళ్లపై హైకమాండ్ సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం.. అసలేం జరిగింది..
మీడియా సాక్షిగా మంత్రి నాదెండ్ల మనోహర్‌కు నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి క్షమాపణ చెప్పాలని అధిష్టానం ఆదేశించిందట.

Nellore TDP: ఆ ఇద్దరు తెలుగు తమ్ముళ్లు రచ్చకెక్కారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. రేషన్ బియ్యం దందాపై తప్పు మీదంటే మీదని..డైలాగ్ వార్ నడిచింది. కట్ చేస్తే ఈ మ్యాటర్ టీడీపీ అధిష్టానం దగ్గరకు వెళ్లడంతో..రాష్ట్ర అధ్యక్షుడు సీరియస్ అయ్యారట. పంచాయితీని సెటిల్ చేయాలని జిల్లా మంత్రికి ఆదేశాలు వచ్చాయట. అసలు వాళిద్దరి లొల్లి ఎందుకు? హైకమాండ్ సీరియస్ ఎందుకు అయింది? జిల్లా మంత్రి ఏం చేయబోతున్నారు?
నెల్లూరులో ఇద్దరు టీడీపీ నేతల మధ్య రాజుకున్న వివాదం కూటమిలో చర్చకు దారి తీసింది. రేషన్ బియ్యం దందాపై..టీడీపీ పార్టీకే చెందిన నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఇష్యూ పెద్దది కావడంతో చివరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యే వరకు పరిస్థితి వచ్చింది. పార్టీ అధ్యక్షుల ఆదేశాలతో మంత్రి నారాయణ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా..ఈ ఇద్దరు నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేచారని కూడా అంటున్నారు.
కొంతకాలంగా నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతుంది. ఇప్పటికే అనేకసార్లు వందల టన్నుల రేషన్ బియ్యాన్ని, అక్రమ రవాణా చేస్తున్న లారీలను అధికారులు పట్టుకున్నారు. ఈ క్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి..ఈ రేషన్ బియ్యం మాఫియాపై ఇటీవల స్పందించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో టీడీపీకి చెందిన ఓ నాయకుడు వందల టన్నుల బియ్యాన్ని చెన్నైకి తరలిస్తున్నారని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. మంత్రి నారాయణకు సన్నిహితుడైన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై పరోక్షoగా ఘాటుగా విమర్శించారు.
వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి అటు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి రేసులోనూ ఉన్నాడు. ఇదే సమయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేరును కూడా ఆయన ప్రస్తావించారు. దీంతో వివాదం తెరపైకి వచ్చింది. మరోవైపు అటు పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి..తనపై నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చేసిన విమర్శలను ఖండించారు. ఈ వ్యవహారంలో అటు మంత్రి నాదెండ్ల మనోహర్ పేరు ప్రస్తావన తేవడంతో జనసేన నేతలు..నుడా శ్రీనివాసులురెడ్డిపై మండిపడుతున్నారట.
తీవ్రంగా స్పందించిన నాదెండ్ల మనోహర్..
టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయం లేదన్న రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుందని భావిస్తున్నారట. నాదెండ్ల మనోహర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై ఫిర్యాదు చేశారు నాదెండ్ల మనోహర్. అసలు ఈ వ్యవహారంలో ఏం జరుగుతుంది అన్న విషయంపై పౌరసరఫరాల శాఖ నుంచి ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నివేదిక కోరారట. దీంతో ఆ నివేదిక విజయవాడకు చేరిందట. అయితే ఆ నివేదికలో ఏముందనేది పౌరసరఫరాల శాఖ మంత్రి బయట పెట్టాల్సి ఉందట.
నోరు జారితే కఠిన చర్యలు..
కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పట్టాభిరామిరెడ్డి మధ్య చెలరేగిన దుమారం టీడీపీ, కూటమి ప్రభుత్వం విమర్శల పాలయ్యే పరిస్థితి రావడంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఇద్దరి స్పీడ్‌కు కళ్లెం వేసేందుకు చర్యలకు చేపట్టింది. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని మంత్రి నారాయణకు స్పష్టం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానం ఆదేశించిందట. అంతేకాక మీడియా సాక్షిగా మంత్రి నాదెండ్ల మనోహర్‌కు నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి క్షమాపణ చెప్పాలని అధిష్టానం ఆదేశించిందట.
పవన్ తో కూర్చుని పంచాయితీలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోందని మంత్రి ఆవేదన..
దీంతో మంత్రి నారాయణ అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ వివాదానికి కారణమైన నెల్లూరు టీడీపీ నేతలతో పాటు రాష్ట్రంలోని అందరి టీడీపీ నేతలకు స్మూత్‌గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. ఏ విషయంలోనూ ఇష్టం వచ్చినట్లు ఎవరికి వారు స్టేట్ మెంట్లు ఇవ్వొద్దని..పార్టీ అధిష్టానం ఆదేశిస్తేనే మాట్లాడండని..ఖరాఖండిగా చెప్పేశారు మంత్రి నారాయణ..చిన్న చిన్న వివాదాలకు కూడా వారానికో..ఐదు రోజులకో ఒకసారి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కూర్చుని పంచాయితీలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూనే..ఇక నుంచి పార్టీకి నష్టం జరిగే చర్యలు ఎవరైనా చేస్తే ఉపేక్షించేది లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు.
మరోవైపు వివాదాన్ని తెరపైకి తెచ్చిన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కూడా తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ తప్పుగా భావించొద్దని చెప్పుకొచ్చారు. ఇంతటితో ఈ వివాదం ముగుస్తుందా..లేక మళ్లీ లీడర్లు రచ్చకెక్కుతున్నారా అనేది చూడాలి.
Also Read: గూగుల్ డేటా సెంటర్ చుట్టూ రాజకీయం..! ఎందుకిలా? వైసీపీ వాదన ఏంటి?