Jubilee Hills Bypoll: రసవత్తరంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయం.. ప్రచారంలోకి ఆ ముగ్గురు బిగ్ పొలిటికల్ స్టార్లు..!
బైఎలక్షన్‌లో గెలవడం ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు భవిష్యత్‌పై బలమైన ఆశలు కల్పించవచ్చని భావిస్తున్నారట కేసీఆర్ అండ్ కో.

Jubilee Hills Bypoll: నామినేషన్ల పర్వం కైమాక్స్‌కు వచ్చింది. ప్రచారం స్పీడందుకుంది. ఇక జోరు పెంచాయి పార్టీలు. కాంగ్రెస్ తరఫున ఆ ముగ్గురు మంత్రులు..కారు పార్టీ నుంచి ఆ ఇద్దరు అన్నీ తామై జోరు పెంచారు. బీజేపీ అభ్యర్థి ప్రచారం ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతోంది. ఇక ఆ ముగ్గురు ముఖ్యనేతలు జూబ్లీహిల్స్ ప్రచార బరిలోకి దిగబోతున్నారట. బై ఎలక్షన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మూడు ప్రధాన పార్టీలు అగ్రనేతలు.. సభలు, రోడ్‌షోలతో హోరెత్తించబోతున్నారట. ఇంతకు ఏ పార్టీ నుంచి ఏ కీలక నేత రంగంలోకి దిగబోతున్నారు?
తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ..బై ఎలక్షన్‌లో గెలిచేందుకు అన్ని అవకాశాలను వాడుకునే ప్లాన్ చేస్తున్నాయి. సిట్టింగ్ సీటును గెలిచి తీరాలన్న పట్టుదలతో బీఆర్ఎస్..ఈ ఎన్నికలో విజయం ద్వారా ప్రజలు మద్దతు ఉందని చెప్పుకునే ప్రయత్నంలో కాంగ్రెస్..బస్తీమే సవాల్ అంటున్నాయి.
జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌ను సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్ ఇప్పటికే ముగ్గురు మంత్రులకు బాధ్యతలు ఇచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరావులు జూబ్లీహిల్స్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే బైపోల్ ఇంచార్జీలుగా ఉన్న ఆ ముగ్గురు మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ సంతృప్తిగా లేరట. ఇక లాభం లేదని తానే స్వయంగా రంగంలోకి దిగాలనుకుంటున్నారట. తాను ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో మంత్రులు దూసుకుపోవడం లేదని..ప్రచారంలో మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇబ్బందికరంగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.
మంత్రులను నమ్ముకుంటే అయ్యేలా లేదన్న భావన..!
బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత తన భర్త మాగంటి గోపీనాథ్‌ను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడంపై మంత్రులు తుమ్మల, పొన్నం చేసిన వ్యాఖ్యలు జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా ఉన్నాయని అనుకుంటున్నారట. మంత్రుల కామెంట్స్ మహిళా ఓటర్లను ప్రభావితం చేస్తాయని, ఆ వ్యాఖ్యలు పరోక్షంగా బీఆర్ఎస్ అభ్యర్ధికే మేలు చేసేలా ఉన్నాయని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారట. ఇక జూబ్లీహిల్స్‌లో పెద్దఎత్తున నకిలీ ఓట్లను సృష్టించారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేసినా..మంత్రులు సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయారని రేవంత్ వాపోతున్నారట. ఈ క్రమంలో ఉప ఎన్నిక ఇంచార్జీలుగా ఉన్న మంత్రులను నమ్ముకుంటే అయ్యేలా లేదని..ఎన్నికలు అయిపోయే వరకు పూర్తిస్థాయిలో జూబ్లీహిల్స్‌పై కాన్సంట్రేట్ చేయాలని భావిస్తున్నారట సీఎం. ప్రచార సరళిని తానే మానిటరింగ్ చేయడంతో పాటు..మూడు, నాలుగు సభలకు ప్లాన్ చేసుకుంటున్నారట.
బీఆర్ఎస్ పార్టీకి లైఫ్ అండ్ డెత్..
ఇక అందరికంటే ముందే జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస్తీలను చుట్టేస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు సభలు పెట్టి గ్రాండ్ సక్సెస్ చేసిన కేటీఆర్.. డోర్ టు డోర్ క్యాంపెయిన్‌కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారట. కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రతీ ఓటరుకు చేర్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అంతేకాదు గులాబీ బాస్ కేసీఆర్ కూడా ప్రచార బరిలోకి దిగబోతున్నారట. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్‌లో గెలుపు అనివార్యమని..ఈ ఎన్నికే బీఆర్ఎస్ పార్టీకి లైఫ్ అండ్ డెత్‌గా భావిస్తోందట గులాబీ దళం.
బైఎలక్షన్‌లో గెలవడం ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు భవిష్యత్‌పై బలమైన ఆశలు కల్పించవచ్చని భావిస్తున్నారట కేసీఆర్ అండ్ కో. ఈ ఊపు అటు స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగించవచ్చని అనుకుంటున్నారట. అందుకే బాస్ రంగంలోకి దిగితే అంతా సెట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట లీడర్లు. అందుకు తగ్గట్లుగా కేసీఆర్ ప్రచారంలో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారట. ఈ నెల 19న జూబ్లీహిల్స్‌లో భారీ రోడ్‌షోకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందట. ఆ రోడ్ షోతో పాటు మరో రెండు సభల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందట. ప్రచార గడువు లాస్ట్ డే రోజు కేసీఆర్ సభ ఉండేలా..లాస్ట్ రెండు మూడ్రోజులు ఓ వైపు డోర్ టు డోర్ క్యాంపెయిన్..ఇంకోవైపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
ఇక జూబ్లీహిల్స్‌పై బీజేపీ కూడా సీరియస్‌గానే ఫోకస్ చేసింది. ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ సెగ్మెంట్..కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. పైగా జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి కిషన్‌రెడ్డికి సన్నిహితుడు. ఎందరో ఆశావహులు టికెట్ కోసం లాబీయింగ్ చేసినా..కిషన్‌రెడ్డి పట్టబట్టి దీపక్‌రెడ్డికి టికెట్ ఇప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ ప్రచార బరిలోకి దిగబోతున్నారట. ఆయన కూడా రోడ్‌షోలు, బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల వాళ్లు ఉంటారు కాబట్టి..అవసరమైతే ఒకరిద్దరు జాతీయ స్థాయి బీజేపీ నేతలతో కూడా ప్రచారం చేయించే ఆలోచన చేస్తున్నారట. అలా మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు బిగ్ పొలిటికల్ స్టార్లు రంగంలోకి దిగుతుండటంతో..ప్రచారం హోరెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సుమంత్ పేరు.. ఎవరీ సుమంత్? ఏంటీ అసలు గొడవ?.. ఫుల్ డిటెయిల్స్