జొమాటోలో 500పైగా ఉద్యోగుల తొలగింపు…6నెలలు 50శాతం జీతం కట్

కరోనా సంక్షోభం ఇప్పుడు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోపై పడింది. లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ జొమాటో యాజమాన్యం ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. తమ ఉద్యోగుల్లో 13 శాతం మందిని తొలగిస్తున్నట్లు జొమాటో ప్రకటించింది. జొమాటొలో దాదాపు 4,000మంది ఉద్యోగులున్నారు. అంటే 500మందికి పైగా ఉద్యోగులను జొమాటో తొలగిస్తోంది.
అంతేకాకుండా జూన్ నుంచి రాబోయే 6నెలల పాటు మిగతా ఉద్యోగుల వేతనాల్లోనూ 50 శాతం కోత విధించనున్నట్లు జొమాటో తెలిపింది. తొలగించిన ఉద్యోగులకు సంస్థ ఆర్థిక సహాయం చేస్తుందని.. కొత్తగా ఉద్యోగాలు పొందడానికి జొమాటో సాయం చేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో 540 మంది ఉద్యోగులను జొమాటో తొలగించిగా.. మరోసారి లేఆఫ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
దీనిపై జొమాటో వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ మాట్లాడుతూ…జొమాటో వ్యాపారంపై లాక్‌డౌన్ తీవ్ర ప్రభావం చూపిందని, తప్పని పరిస్థితుల్లో కిరాణా సరుకులు డెలివరీ చేయాల్సి వస్తోందన్నారు. వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయన్నారు. దేశవ్యాప్తంగా అనేక రెస్టారెంట్లు శాశ్వతంగా మూతపడ్డాయన్నారు. రాబోయే 6 నుంచి 12 నెలల మధ్య కాలంలో మరో 25 నుంచి 40 శాతం రెస్టారెంట్లు మూత పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థకి ఉద్యోగులందరినీ భరించడం కష్టం కనుక 13శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాబోయే ఆరు నెలలు తక్కువ వేతనాలు ఉన్నవారికి తక్కువ కోతలు, ఎక్కువ వేతనాలు ఉన్న వారికి 50శాతం కోతలు విధించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అనేక మంది రాబోయే ఆరు నెలల జీతాలు వదులుకోవడానికి స్వచ్చందంగా ముందుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.