ఢిల్లీలో వడగళ్ల వాన: రోడ్లపై ముత్యాలు పడ్డాయా అన్నట్లుగా ఉంది

  • Published By: nagamani ,Published On : May 14, 2020 / 02:23 PM IST
ఢిల్లీలో వడగళ్ల వాన: రోడ్లపై ముత్యాలు పడ్డాయా అన్నట్లుగా ఉంది

దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాతావ‌ర‌ణ ఒక్క‌సారిగా మారిపోయింది. గురువారం (మే 14,2020) సాయంత్రం ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా గాలిదుమ్ము ఎగిసిప‌డ్డాయి. అనంతరం కొద్ది సేప‌టికే బ‌ల‌మైన ఈదురు గాలులు వీస్తూ వ‌ర్షం మొద‌లైంది. న‌గ‌రంలోని కొన్ని చోట్ల ఓ మోస్త‌రుగా మ‌రికొన్ని చోట్ల భారీగా వ‌ర్షం కురిసింది. క‌శ్మీర్ గేట్ ప‌రిస‌ర ప్రాంతాల్లో వ‌డ‌గండ్లు బీభ‌త్సం సృష్టించాయి. మ‌రికొన్ని చోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది. 

దీంతో ఢిల్లీ వాసులు సడెన్ గా వచ్చిన వర్షానికి నానా కష్టాలు పడ్డారు. పైగా కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు భారీగా పడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో రోడ్లపై ముత్యాలు పడ్డాయా అన్నట్లుగా మారిపోయాయి. వేడితో అల్లాడిపోతున్న ఢిల్లీ వాసులకు ఈ వర్షం కాస్త సేదతీర్చింది. వేడిని తగ్గించి హాయిని చేకూర్చింది.

అంతేకాదు..కొన్ని ఇబ్బందుల్ని కూడా తెచ్చింది. ధూళి తుపాన్, బలమైన గాలులతో మధ్యాహ్నాం 4గంటల సమయంలోనే చీకటిగా మారిపోయింది. రోడ్లపైకి వచ్చేవారు వాహనాలకు లైట్లు వేసుకుని వస్తున్నారు.  

మే 13-14 మధ్య ఉత్తర మరియు వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో తాజా వర్షపాతం మరియు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని MeTడిపార్ట్మెంట్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో గురువారం నాలుగు రాష్ట్రాలు,మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించబడింది.