అయ్య బాబోయ్..ఉల్లి పకోడీలో కప్ప..!!

అయ్య బాబోయ్..ఉల్లి పకోడీలో కప్ప..!!

Frog in Onion pakodas : చల్ల చల్లటి వాతావరణంలో వేడి వేడి పకోడిలు తింటే భలేగుంటుంది. అలా ఏపీలోని చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఓ వ్యక్తి పాపం వేడి వేడి ఉల్లి పకోడీలు తినాలనుకున్నాడు. అలా గత సోమవారం (జనవరి 4,2021) సాయంత్రం రాజీవ్‌ కాలనీలోని పకోడీలు, బజ్జీలు అమ్మే దుకాణం వద్దకెళ్లి ఉల్లిపకోడీలు కొనుకున్నాడు.

వాటిని ప్యాక్ చేయించుకుని ఇంటికి పట్టుకెళ్లి..తింటుండగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. పకోడీల్లో మెత్త మెత్తగా ఒకటి కనిపించింది. అది పకోడీ మాత్రం కాదు. అదొక ‘కప్ప’ అని గుర్తించి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. షాక్ అయ్యాడు. తరువాత కోపం వచ్చింది.

గబగబా తాను పకోడీలు కొన్న దుకాణం వద్దకెళ్లి ఆ దుకాణంలో పకోడీలు అమ్మిన వ్యక్తికి పకోడీల్ని దాంట్లో ఉన్న కప్పని చూపెట్టాడు. ఇదేంటీ..ఇలాగే అమ్మేస్తున్నావా? పకోడీలు ఎక్కువ అవ్వాలని కప్పల్ని కూడా వేగించేసి అమ్మేస్తున్నావా? అంటూ ప్రశ్నించగా..బాబ్బాబు తప్పైపోయింది ఇంకోసారి ఇలా జరక్కుండా చూసుకుంటానని సర్ధి చెప్పాడు.

దీనిపై సదరు వినియోగదారుడు మాట్లాడుతూ..తాను పకోడీలు తిందామని కొనుక్కుని ఇంటికెళ్లి తిందామనేసరికి పకోడీల్లో కప్ప కనిపించింది. కానీ అప్పటికే మా కుటుంబ సభ్యులు కొన్ని పకోడీలు తిన్నామని కానీ మాకు ఎవ్వరికీ ఎటువంటి హానీ జరగలేదని..కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఉంటే పరిస్థితి ఏంటంటూ వాపోయాడు.