బిగ్‌బాస్: కొరడాతో ఇంటి సభ్యులకు నాగార్జున ఝలక్, గంగవ్వకు ఇల్లు కట్టిస్తానని హామీ

బిగ్‌బాస్: కొరడాతో ఇంటి సభ్యులకు నాగార్జున ఝలక్, గంగవ్వకు ఇల్లు కట్టిస్తానని హామీ

నామినేషన్‌లో కూడా లేని గంగవ్వ ఎలిమినేషన్ అనేది లేకుండానే Biggboss ఇంటి బాట పట్టింది. అనారోగ్యం కార‌ణంగా ఇంటికి వెళ్లిపోతున్నందుకు అంతా కలిసి ఆమెకు సెండాఫ్ ఇచ్చారు. సొంతిల్లు కట్టుకోవాలనే కలతో ఇంట్లోకి అడుగుపెట్టిన గంగవ్వకు హీరో నాగార్జున ఆ కలను తాను నిజం చేస్తానని మాటిచ్చారు. కోపంతో నోరు పారేసుకుంటున్న సోహైల్‌, మెహ‌బూబ్‌ల‌కు నాగ్ అక్షింత‌లు వేశారు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకూడ‌ద‌ని హెచ్చ‌రించి ఇద్ద‌రూ సేఫ్ జోన్‌లోనే ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇంటిస‌భ్యుల‌కు బిగ్‌బాస్ నిద్ర‌లో నుంచి లేపి కోటింగ్ ఇచ్చాడు. మైక్ స‌రిగా ధ‌రించ‌డం లేదని.. తెలుగులో మాట్లాడ‌టం లేదంటూ సీరియ‌స్ అయ్యాడు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవ‌డం లేద‌ని తిట్టిపోశాడు. ఇంకోసారి ఎవ‌రు రూల్స్ బ్రేక్ చేసినా కెప్టెన్ సొహైల్ అన్ని కెమెరాల‌కు సారీ చెప్పాల్సి ఉంటుందని ఆదేశించాడు. ఆ తర్వాత ఒప్పో టాస్క్‌లో ఒక్కొక్క మెంబర్ విన్ అయిన స్పెషాలిటీ గురించి చెప్పాడు.



మోస్ట్ స్టైలిష్ ప‌ర్స‌న్ – మెహ‌బూబ్‌
ప‌ర్ఫెక్ట్ పిక్చ‌ర్ – అరియానా
మోస్ట్ స్పీడీ – లాస్య‌
మోస్ట్ హైలెటెడ్ ఇన్ ద క్రౌడ్ – అవినాష్‌
మోస్ట్ క్లియ‌ర్ ఇన్ థాట్ – కుమార్ సాయి
మోస్ట్ ఎనర్జటిక్ – అమ్మ‌రాజ‌శేఖ‌ర్
ఆల్‌రౌండ‌ర్‌ – మోనాల్‌

నాగార్జున స్టేజీపైకి వచ్చీ రాగానే అఖిల్‌, అభిజిత్ మీద ఫైర్ అయ్యారు. నామినేష‌న్ చేసుకునేట‌ప్పుడు మ‌ధ్య‌లో మోనాల్ పేరు ఎందుకు తీసుకొచ్చారని ప్ర‌శ్నించారు. ఇలా ఇంకోసారి జ‌రగ‌కూడ‌ద‌ని కొర‌డా ఝుళిపించారు. స్వాతి దీక్షిత్‌ను నామినేట్ చేసినందుకు‌ మాస్టర్‌పై నోయ‌ల్ అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సంగతి గుర్తు చేస్తూ.. మ‌రి కుమార్ సాయి విష‌యంలో ఏమీ అనిపించ‌లేదా అని నిల‌దీశారు. నీళ్లు న‌మిలిన నోయ‌ల్‌ వ‌చ్చి సారీ చెప్పినా క‌నీసం ఏం చెప్తున్నారనేది కూడా వినిపించుకోరా? అని మాస్ట‌ర్‌ను ప్ర‌శ్నించారు. దివిపైన అరుపులు ఏంటి? పిచ్చి కుక్క‌లా అరుస్తున్న‌ట్లు ఉంది అని సొహైల్‌పై ఫైర్ అయ్యారు.

అవినాష్‌.. దివికి లైన్ వేసిన విష‌యాన్ని అంద‌రి ముందు నాగ్ బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. సీక్రెట్ టాస్క్ మాత్రం బాగా ఆడావ‌ని మెచ్చుకున్నారు. స్టార్లు దొంగిలించి ఆట ఆగిపోయేలా చేశాడ‌ని అభిజిత్‌ను నిందించారు. నీ గెలుపు కోసం మాత్ర‌మే పాటుప‌డ‌టం వ‌ల్ల హోట‌ల్ సిబ్బంది టీమ్ ఓడిపోయింద‌ని వ్యాఖ్యానించారు. పుచ్చ ప‌గిలిపోతుందని మెహబూబ్ అన్న మాట బ‌య‌ట హోట‌ల్‌లో మాట్లాడితే మెడ‌ప‌ట్టి తోసేసి పోలీసులు మోకాళ్లు విర‌గ్గొడ‌తారని గ‌ట్టిగానే హెచ్చ‌రించారు. ఆ ప‌దం వాడ‌టం త‌ప్ప‌ని, ఇంటి స‌భ్యుల‌కు సారీ చెప్ప‌ాలని సూచించిన సోహైల్‌ను అభినందించారు.

గంగ‌వ్వకు ఆరోగ్యం స‌రిగా లేద‌ని.. అవ్వ‌ను క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి ర‌మ్మ‌ని చెప్పిన నాగ్.. అన్న‌ను చూసి బోరున విల‌పించింది. ‘ప‌దిరోజులుగా నిద్ర పోత‌లేను. ఇల్లు లేద‌ని వ‌చ్చాను. కానీ నా వ‌ల్ల ఐత‌లేదు. ఆట కూడా ఆడ‌లేక‌పోతున్నా. ఊరికి పంపించేయండి. నీకు మ‌నుమ‌రాలు పుట్టిన‌ప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చి మీ ఇల్లు చూస్తా’ అని అంది. ఆమె అవ‌స్థ‌కు క‌ల‌త చెందిన నాగ్‌.. అవ్వ ఈ హౌస్‌ను వీడేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని బిగ్‌బాస్‌కు విన్న‌వించారు. ఆమె వెళ్లిపోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించిన బిగ్‌బాస్ మాటను జీర్ణించుకోలేక‌పోయాడు అఖిల్. అవ్వ‌కు హార్ట్ షేప్ పిల్లోను బ‌హుమ‌తిగా ఇచ్చాడు. ఇంటి స‌భ్యులంద‌రూ ఆమెకు క‌న్నీటితో వీడ్కోలు ప‌లికారు.

స్టేజీపైకి వ‌చ్చిన అవ్వ ఇంటి స‌భ్యులంద‌రి గురించి మంచి-చెడు చెప్పుకొచ్చింది. హారిక అప్పుడే న‌వ్వుతూ, వెంటనే సీరియ‌స్ అవుతుందని తెలిపింది. దివి.. ఎవ‌రైనా మాట్లాడ‌క‌పోతే ముఖం మాడ్చుకుంటుంద‌ని చెప్పింది. సోహైల్‌.. నాగుపాము అని, అత‌డిలో మంచి చెప్పుకునేందుకు ఏమీ లేద‌ని గాలి తీసేసింది. అఖిల్‌ను పెంచుకుంటానంది. అమ్మ రాజ‌శేఖ‌ర్ హౌస్‌లో ఉండాలి అని తీర్పు చెప్పింది. అలాగే త‌న‌ను సినిమాలో తీసుకోవాల‌న్న అవ్వ‌ కోరిక‌కు మాస్ట‌ర్ త‌ప్ప‌కుండా అవ‌కాశ‌మిస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. మోనాల్ మంచిద‌ని, అమాయ‌కురాల‌ని చెప్పుకొచ్చింది.

నోయ‌ల్‌.. హౌస్‌ నుంచి బ‌య‌ట‌కు రాగానే పెళ్లి చేసుకోవాల‌ని ఆదేశించింది. లాస్య, త‌న పెద్ద బిడ్డ అని, సుజాత నామినేష‌న్‌లోకి వ‌స్త‌ుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. అభిజిత్ ముఖం క‌డుక్కోకుండా కాఫీ, టీలు తాగుతార‌ని, అందుకే నామినేట్ చేశాన‌ని తెలిపింది. అరియానా చూడ‌టానికి చిన్న‌పిల్ల‌లానే ఉంటూ ముఖం మీదే అనేస్త‌ుంటుంద‌ని పొగిడింది. అవినాష్‌ను కుందేలుగా అభివ‌ర్ణించింది. కుమార్ సాయి రోజూ నేర్చుకుంటున్నాడ‌ని, అంద‌రితో క‌లిసిపోయాడంది. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే అఖిల్‌ను సేఫ్ చేసింది. రేప‌టి ఎపిసోడ్‌లో సుజాత ఎలిమినేట్ అయిన‌ట్లుగా లీకు వీరులు చెబుతున్నారు.