doctors Commitment : ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తుండగా ఆస్పత్రిలో చెలరేగిన మంటలు..ప్రాణాలు పణంగా పెట్టి ఆపరేషన్ కొనసాగించిన వైద్యులు

ప్రాణాలు పణంగా పెట్టి మరీ...ఓపెన్ హార్ట్ సర్జరీ కొనసాగించారు వైద్యులు. తమ ప్రాణాలు కాపాడుకోవడం కన్నా ముందు....ఓపెన్ హార్ట్ సర్జరీ చికిత్స చేయించుకుంటున్న రోగి ప్రాణాలు నిలపడానికే ప్రాధాన్యం ఇచ్చారు.

doctors Commitment : ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తుండగా ఆస్పత్రిలో చెలరేగిన మంటలు..ప్రాణాలు పణంగా పెట్టి ఆపరేషన్ కొనసాగించిన వైద్యులు

Doctors Commitment In Russia

doctors Commitment in Russia : తూర్పు రష్యాలో ఓ భారీ భవనంలో ఏర్పాటయిన ఆస్పత్రి…గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఆపరేషన్ థియేటర్‌లో వైద్యులు ఒక హార్ట్‌ పేషెంట్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహిస్తున్నారు. గుండె సంబంధ వ్యాధులతో బాధపడేవారికి….ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది చాలా పెద్ద చికిత్స. కాస్త అటూ ఇటూ అయినా..రోగి ప్రాణాలు కోల్పేయే ప్రమాదం పొంచి ఉంటుంది. డాక్టర్లంతా ఆపరేషన్ రూంలో ఓపెన్ హార్ట్ సర్జరీ మొదలు పెట్టారు. ఇంతలో అనుకోని విపత్తు వచ్చి పడింది. ఆస్పత్రి భవనం పై భాగంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు వ్యాపిస్తున్నాయి. కళ్లు మూసి తెరిచేంతలో భవనం మొత్తం పొగతో నిండిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహిస్తున్న ఆపరేషన్ గదిలో కూడా పొగ కమ్ముకుంటోంది.

సాధారణంగా ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు..? ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే…తమ ప్రాణాలు రక్షించుకోవాలన్న ఆలోచనతో బయటకు పరుగులు తీస్తారు. ముందూ వెనకా ఏమీ ఆలోచించకుండా…..అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ రష్యా డాక్టర్లు అలా చేయలేదు. మంటలు చుట్టుముడుతున్నాయని భయపడి…ఆ క్షణం డాక్టర్లు అక్కడి నుంచి వెళ్లిపోతే..సర్జరీ మధ్యలోనే ఆగిపోతుంది. పేషెంట్ ప్రాణాలు నిలబడవు. సర్జరీ ఆపివేసి…మిగిలిన రోగులతో పాటు..ఆ పేషెంట్‌ను అక్కడి నుంచి తరలించే పరిస్థితి లేదు. అందుకే తమ ప్రాణాలు పణంగా పెట్టి మరీ…ఓపెన్ హార్ట్ సర్జరీ కొనసాగించారు వైద్యులు. తమ ప్రాణాలు కాపాడుకోవడం కన్నా ముందు….ఓపెన్ హార్ట్ సర్జరీ చికిత్స చేయించుకుంటున్న రోగి ప్రాణాలు నిలపడానికే ప్రాధాన్యం ఇచ్చారు.

పై అంతస్థు నుంచి మంటలు వేగంగా కిందకు వ్యాపిస్తున్నా…డాక్టర్లు వెనక్కి తగ్గలేదు. ప్రాణభయాన్ని పక్కనపెట్టి…వృత్తికి అంకితమయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది….భవనం దగ్గరకు చేరుకున్నారు. బయట వారు మంటలను ఆర్పేందుకు పోరాటం చేస్తోంటే…లోపల వైద్యులు…రోగి ప్రాణాలు నిలబెట్టేందుకు పోరాడారు.

మంటలు భారీగా చెలరేగడంతో…అదుపులోకి తీసుకురావడం కష్టంగా మారింది. ఆపరేషన్‌ రూంలోకి పొగ దట్టంగా వ్యాపించింది. దీంతో స్పెషల్ ఎలక్ట్రిక్ ఫైర్ బ్రిగేడ్ ఫాన్లు ఉపయోగించి..ఎప్పటికప్పుడు పొగను బయటకు పంపించారు. అలాంటి పరిస్థితుల మధ్యే..క్లిష్టతరమైన ఓపెన్ హార్ట్ సర్జరీని ముగించి ఓ నిండుప్రాణం నిలబెట్టారు డాక్టర్లు. వైద్యో నారాయణో హరి అన్న సూక్తికి అసలైన నిర్వచనంగా నిలిచారు. అంతకన్నా మరోలా ప్రవర్తించాలని తామెవ్వరం అనుకోలేదని, రోగిని రక్షించడమే తమ కర్తవ్యంగా భావించామని ఆపరేషన్‌ నిర్వహించిన వైద్యుల్లో ఒకరు చెప్పారు.

ఆపరేషన్ రూం మినహా మిగిలిన భవనంలో ఉన్న 60 మంది రోగులను అధికారులు అక్కడినుంచి తరలించారు. కొన్ని గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధి నిర్వహణలో నిబద్ధత చూపిన రష్యా డాక్టర్ల తెగువపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.