ఇక ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలోనూ ఇస్రో అంతరిక్ష పరిశోధనలు!

  • Published By: srihari ,Published On : June 25, 2020 / 04:01 PM IST
ఇక ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలోనూ ఇస్రో అంతరిక్ష పరిశోధనలు!

అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలున్నాయి. అవేంటో తెలుసుకోవాలని నిత్యం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతరిక్ష పరిశోధనలు ఇప్పటి వరకూ ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. ఇండియాలోని ఇస్రో గానీ… అమెరికాలోని నాసా గానీ.. ఐరోపా దేశాల్లోని యూరోపినయన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గానీ.. ఇలా ఏ దేశానికి సంబంధించిన పరిశోధనలైనా.. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు అంతరిక్ష పరిశోధనల్లోకి కూడా ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశాలు ఇచ్చేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా భారత కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్రో పరిశోధోనల్లో ప్రైవేటు రంగ సంస్థలకు భాగస్వామ్యాన్ని కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యం షురూ : 
అద్భుత ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. వరుస ప్రయోగాలతో ఘన విజయాలను అందుకుంది. చిట్ట చివరి నిమిషంలో విఫలం అయినప్పటికీ.. చంద్రయాన్-2 మిషన్‌లో భారత శాస్త్రవేత్తలు సేవలు గుర్తించదగ్గవే. అంతరిక్ష ప్రయోగాల్లో.. సాంకేతిక పరిజ్ఙానంలో అగ్ర దేశాల సరసన భారత్ నిలుస్తోంది. అలాంటి అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఫలితంగా ఇస్రోలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థల భాగస్వామ్యం ప్రారంభమౌతుంది. 

అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కల్పించాలనే నిర్ణయాన్ని ఇస్రో వర్గాలు ఆహ్వానిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల అంతరిక్ష సాంకేతిక పరిజ్ఙానం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాయి. స్పేస్ టెక్నాలజీలో వినూత్నమైన ఆవిష్కరణలకు అవకాశం చిక్కుతుందని అంటున్నాయి. ఈ రంగంలో భారత్ ఇప్పటికే అనేక ఘన విజయాలను నమోదు చేసిందని, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వల్ల మరిన్ని ఘన విజయాలను అందుకోవడానికి వీలుంటుందని అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో అంతరిక్ష పరిజ్ఙానాన్ని మరిన్ని రంగాలకూ విస్తరింపజేయవచ్చు. దేశ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న రంగాల్లో పురోభివృద్ధిని సాధించవచ్చని నిపుణులు అంటున్నారు. 

స్పేస్ టెక్నాలజీలో మరిన్ని ఉద్యోగాలు :
వ్యవసాయం వంటి రంగాలకు అంతరిక్ష పరిజ్ఞానాన్ని విస్తరింపజేయడానికి ప్రైవేటు భాగస్వామ్యం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. స్పేస్ టెక్నాలజీని గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవడానికి, దాని ఫలాలను సామన్యులకు అందజేయడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా రక్షణరంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని ఇస్రో చైర్మన్ శివన్ అభిప్రాయపడుతున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా భారత్ ఎదిగేందుకు ప్రైవేటు భాగస్వామ్యం దోహదం చేస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకూ స్పేస్ టెక్నాలజీలో పరిమితంగా ఉద్యోగ అవకాశాలు ఉండేవి. కేంద్రం నిర్ణయంతో ఈ అవకాశాలు మరింత విస్తృతమౌతాయని భావిస్తున్నారు. 

ప్రైవేటు భాగస్వామ్యులను గుర్తించడంలో ఇస్రోను నోడల్ ఏజెన్సీగా కేందం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రైవేటు భాగస్వాములను ఇస్రో ఎంపిక చేస్తుంది. అంతరిక్ష పరిశోధనల రంగంలో ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం అందించేందుకు వీలుగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. భారత అంతరిక్ష సంస్థ మౌలిక సదుపాయాలను ప్రైవేటు సంస్థలు ఉపయోగించుకొనేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఇస్రోలో అంతర్భాగంగా ఇన్ స్పేస్ గతంలోనూ ఉంది. దాన్ని ఇప్పుడు మరింతగా విస్తరిస్తున్నారు. ఇస్రో ప్రాజెక్టులు, మిషన్లు యథావిధిగా కొనసాగుతాయి. అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలకు సంబంధించి నిర్ణయాధికారం ఇస్రోకే ఉంటుంది. 

అంతరిక్ష పరిశోధనల్లో సంస్కరణలు కొనసాగిస్తే.. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో అంతరిక్ష రంగం వాటా అయిదారేళ్లలో 10 మిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయంటున్నారు. చైనా, అమెరికా, ఐరోపా దేశాలు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడు భారత్‌లో కూడా రాకెట్, శాటిలైట్ పరికరాల తయారీలో ప్రైవేటు కంపెనీలు భాగస్వాములు కానున్నాయి. ఇస్రోకు ఓ ప్రత్యేకత ఉంది. ఏ రకంగా చూసుకున్నా.. ప్రభుత్వ రంగ సంస్థల్లో అద్భుతంగా పని చేస్తోన్న సంస్థ ఇస్రో. పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివృద్ధి చేయడం ద్వారా గుర్తింపు పొందింది. సామాన్యుల అవసరాలతో పాటు భద్రతా రంగానికి అవసరమైన సేవలను కూడా అందిస్తోంది. ప్రపంచ దేశాల్లో భారత్ను ముందు వరసలో నిలిచేలా చేసింది. 

చంద్రయాన్‌ టూ అంగారకుడి వరకు :
హైటెక్ ఆర్ అండ్ డితో పాటు, టెలి-ఎడ్యుకేషన్, టెలి-మెడిసిన్, విపత్తు నిర్వహణ, వ్యవసాయం, మత్స్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి సామాజిక ప్రయోజనాల కోసం ఇస్రో పని చేస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలకు దీటుగా నిలుస్తోంది. అది కూడా తక్కువ వ్యయంతో చేస్తుండడం విశేషం. అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా చంద్రయాన్‌తో పాటు అంగారకుడిపై కూడా దృష్టి సారించి దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ చేపట్టిన ప్రయోగాలన్నీ అతి తక్కువ బడ్జెట్‌తోనే పూర్తి చేయడం ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది ఇస్రో. 

అంతరిక్ష పరిశోధనల కోసం చైనా 3 బిలియన్ డాలర్లు, అమెరికా 25 బిలియన్ డాలర్లు వ్యయం చేస్తుంటే.. భారత్ ఈ రంగానికి బడ్జెట్‌లో ఒక బిలియన్ డాలర్లు మాత్రమే కేటాయిస్తోంది. అయినా ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరుకోవడం విశేషం. ఇస్రో తొలి ఉపగ్రహ ప్రయోగ వెహికల్ SLV-3 నుంచి తన దూకుడును పెంచుతూ వస్తోంది. ఇప్పుడు క్రయోజెనిక్ ఇంజిన్లను సైతం సొంతంగానే తయారు చేసుకోగలుగుతోంది. గడచిన రెండు దశాబ్దాలుగా 17వేల మంది సిబ్బందితోనే స్థిరంగా కొనసాగుతోంది. కానీ, పరిశోధనల సంఖ్య రాను రాను పెరుగుతోంది. అయినా వెనుకడుగు వేయకుండా దూసుకెళ్తోంది. 

స్టార్టప్లకు మెరుగైన అవకాశాలు : 
NSIL దాదాపు సంవత్సరం క్రితం ఏర్పడింది. దీని ద్వారా ఉపగ్రహాల తయారీ, ఎర్త్ అబ్జర్వేషన్ అప్లికేషన్స్, నావిగేషన్ అప్లికేషన్ల తయారీ పరిశ్రమల భాగస్వామ్యానికి తగినంత అవకాశం ఏర్పడుతోంది. స్టార్టప్లకు మెరుగైన అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రైవేటు భాగస్వామ్యానికి అనుమతులు ఇవ్వడంతో మరింత దూకుడుగా ముందుకు సాగేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని లాంచింగ్ వాహనాల సెక్టార్‌లో భద్రతా నిబంధనలతో పాటు గోప్యత చాలా కఠినంగా ఉంటాయి. 

తొలిసారిగా ఓ ప్రైవేటు వాహనమైన స్పేస్ ఎక్స్‌ను అంతరిక్షంలోకి పంపించడాన్ని అమెరికా ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటోంది. కానీ ఒకసారి చరిత్రను చూస్తే.. స్పేస్ షటిల్ విఫలమైన తర్వాత కొత్త లాంచింగ్ వాహనాల తయారీలో నాసా పెద్దగా దృష్టి పెట్టడం లేదంటున్నారు. దీంతో ఈ పరిశ్రమలో భాగస్వాములైన ప్రైవేటు సంస్థలే 5 బిలియన్ డాలర్ల ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. ఈ అవకాశాన్ని ఎలన్ మస్క్ అందిపుచ్చుకొని తొలి ప్రైవేటు స్పేస్ షిప్‌ను అంతరిక్షంలోకి పంపించారు. నాసా చేసే ఖర్చు కంటే చాలా తక్కువకే ఈ ప్రాజెక్టును మస్క్ పూర్తి చేశారు. దీనిని బట్టి నాసా కార్యక్రమాల్లో జరుగుతోన్న వ్యవస్థాగత లోపాలు ఓ ప్రైవేటు సంస్థ సక్సెస్‌కు కారణమైందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.