IPL 2023, CSK vs RR: చెపాక్‌లో గ‌ర్జించేది ఎవ‌రో..? హెడ్ టూ హెడ్ రికార్డు ఇదే

చెన్నైలోని చిదంబ‌రం వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు నేడు త‌ల‌ప‌డ‌నున్నాయి.ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో త‌మ స్థానాల‌ను మెరుగుప‌ర‌చుకోవాల‌ని ఇరు జ‌ట్లు బావిస్తున్నాయి.

IPL 2023, CSK vs RR: చెపాక్‌లో గ‌ర్జించేది ఎవ‌రో..? హెడ్ టూ హెడ్ రికార్డు ఇదే

CSK vs RR

IPL 2023, CSK vs RR: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా నేడు మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ద‌మైంది. చెన్నైలోని చిదంబ‌రం వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇరు జ‌ట్లు చెరో మూడు మ్యాచ్‌లు ఆడాయి. రెండేసి విజ‌యాలు సాధించ‌గా ఒక్కొ మ్యాచ్‌లో ఓడిపోయాయి. మ్యాచ్‌ల ప‌రంగా స‌మంగా గెలిచిన‌ప్ప‌టికీ మెరుగైన ర‌న్‌రేట్ కార‌ణంగా రాజ‌స్థాన్ పాయింట్ల ప‌ట్టిక‌లో రెండ‌వ స్థానంలో నిల‌వ‌గా చెన్నై ఐదో స్థానంలో కొన‌సాగుతోంది. ఈ క్రమంలో నేటి మ్యాచ్‌లో విజ‌యం సాధించి త‌మ స్థానాల‌ను మెరుగుప‌ర‌చుకోవాల‌ని ఇరు జ‌ట్లు బావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో హోరా హోరీగా పోరు జ‌రిగే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఇరు జ‌ట్లు ఆడిన మ్యాచుల‌ను గ‌మ‌నిస్తే ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ విజ‌యం సాధించేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అలాగ‌ని చెన్నైని త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీలులేదు. నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన చెన్నై ఎంత ప్ర‌మాద‌కర జ‌ట్టో తెలిసిందే. ధోని నాయ‌క‌త్వంలో ఐదో సారి టైటిట్ గెల‌వాల‌ని ఆ జ‌ట్టు ఉవ్విళ్లూరుతుంది.

ఫామ్‌లో ఉన్న రాజ‌స్థాన్ బ్యాట‌ర్లు

రాజ‌స్థాన్ బ్యాట‌ర్లు ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఆ జ‌ట్టు భారీ స్కోరు చేసింది. ఓపెన‌ర్లు య‌శ‌స్వి జైశ్వాల్‌, జోస్ బ‌ట్ల‌ర్‌ల‌తో పాటు కెప్టెన్ సంజు శాంస‌న్‌, హెట్‌మైర్ లు భీక‌ర‌ఫామ్‌లో ఉన్నారు. వీరితో పాటు దేవ్‌దత్ పడిక్కల్ కూడా రాణిస్తే బ్యాటింగ్‌లో ఆ జ‌ట్టుకు తిరుగులేదు. ఇక బౌలింగ్‌లోనూ సీనియ‌ర్ బౌల్డ్‌, జాస‌న్ హోల్డ‌ర్‌, అశ్విన్‌, చ‌హ‌ల్ లు ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ల‌ను ముప్పులు తిప్ప‌లు పెడుతున్నారు.

వేధిస్తున్న గాయాలు

చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టును గాయాలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా కోట్లు పోసి కొనుకున్న దీప‌క్ చాహ‌ర్‌, బెన్ స్టోక్స్‌లు గాయాల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. రాజ‌స్థాన్‌తో మ్యాచ్‌కు వీరు దూరం అయ్యే అవ‌కాశం ఉంది. వీరి స్థానంలో మ‌హీశ్ తీక్ష‌ణ‌, ప‌థిరాన జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ముంబైతో మ్యాచ్‌లో ఆడ‌ని మోయిన్ అలీ నేడు అందుబాటులో ఉంటాడో లేదో చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. చెన్నై బ్యాటింగ్ భారం మొత్తాన్ని రుతురాజ్ ఒక్క‌డే మోస్తున్నాడు. డేవాన్ కాన్వే, రాయుడు, దూబే లు ప‌ర్వాలేదనిపిస్తున్న‌ప్ప‌టికీ వారి నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది.

అనారోగ్యం కార‌ణంగా మోయిన్ అలీ ముంబైతో మ్యాచ్‌కు దూరం కావ‌డంతో ఆఖ‌రి నిమిషంలో జ‌ట్టులోకి వ‌చ్చిన సీనియ‌ర్ ఆట‌గాడు ర‌హానే విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించాడు. అందివ‌చ్చిన అవ‌కాశాన్ని పూర్తిగా స‌ద్వినియోగం చేసుకోవ‌డంతో ర‌హానే స్థానానికి వ‌చ్చిన డోకా లేదు. జ‌డేజా, ధోనిలు లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో వ‌స్తుండ‌డంతో వారికి ఎక్కువ‌గా బ్యాటింగ్ చేసే అవ‌కాశం రావ‌డం లేదు. ఇన్నింగ్ చివర్లో బ్యాటింగ్ కు వ‌స్తున్న ధోని తనదైన శైలిలో చెల‌రేగుతుండ‌డంతో అభిమానులు ఆనందంతో ఉన్నారు. మ‌రోసారి ధోని నుంచి అలాంటి ఇన్నింగ్స్‌నే ఆశిస్తున్నారు. బౌలింగ్‌లో హంగార్గేక‌ర్, జ‌డేజా, శాంట‌ర్న్‌, తుషార్ దేశ్ పాండేలు రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌ను ఎంత మేర‌కు క‌ట్ట‌డి చేస్తారు అన్న‌దానిపైనే చెన్నై విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.

పిచ్‌

చిదంబ‌రం స్టేడియం పిచ్ సాధార‌ణంగా బ్యాటింగ్‌కు అనుకూలం. పిచ్ పొడిగా ఉండ‌టంతో స్పిన్న‌ర్ల‌కు కాస్త స‌హ‌కారం ఉంటుంది. అయితే.. ఒక్క‌సారి క్రీజులో కుదురుకుంటే మాత్రం ప‌రుగులు ఈజీగా చేయొచ్చు. ఇక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు 67 ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌రుగ‌గా 41 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జ‌ట్టు గెలువ‌గా, 26 సార్లు చేధ‌న జ‌ట్టు విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో టాస్ గెలిచిన వారు బ్యాటింగ్ ఎంచుకునే అవ‌కాశాలు ఉన్నాయి.

26 మ్యాచుల్లో త‌ల‌ప‌డ్డాయి

ఐపీఎల్‌లో చెన్నై, రాజ‌స్థాన్ జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు 26 మ్యాచుల్లో ముఖాముఖిగా పోటీప‌డ్డాయి. చెన్నై 15 సార్లు గెలుపొంద‌గా, రాజ‌స్థాన్ 11 మ్యాచుల్లో విజ‌యం సాధించింది.