కోహ్లీ డకౌట్.. పోలీసుల ట్వీట్.. హెల్మెట్ ఉంటే సరిపోదు.. బాధ్యతగా ఉండాలి

కోహ్లీ డకౌట్.. పోలీసుల ట్వీట్.. హెల్మెట్ ఉంటే సరిపోదు.. బాధ్యతగా ఉండాలి

Kohli

తడబడిన బ్యాట్స్‌మన్‌, సత్తాలేని బౌలింగ్‌.. ఇలా టీమిండియా తొలి మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయింది. దిగ్గజ బ్యాటింగ్ లైనప్‌ ఉన్న కోహ్లీ సేన.. ప్రపంచ నెంబర్‌ వన్‌ టీమ్‌ ముందు సత్తా చూపలేకపోయింది. ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ మాత్రమే రెండెంకెల స్కోరు చేశారు. ధనాధన్‌ క్రికెట్‌ సిరీస్‌ను ఓటమితో ఆరంభించింది. మొతేరాలో ఇంగ్లాండ్‌తో తలపడ్డ తొలి టీ20లో పరాజయం పాలైంది. 8 వికెట్ల తేడాతో నెంబర్‌ వన్‌ టీమ్‌ ముందు చేతులెత్తేసింది.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ కూడా డకౌట్ అయ్యి అభిమానులను నిరాశపరిచాడు.. ఇన్నింగ్స్ 3వ వేసిన స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో బ్యాక్ ఫుట్‌పైకి వెళ్లిన విరాట్ కోహ్లీ మిడాఫ్ దిశగా ఫీల్డర్ క్రిస్ జోర్దాన్ తలమీదుగా బౌండరీ కొట్టేందుకు ట్రై చేసి క్రిస్ జోర్దాన్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కోహ్లి డకౌట్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా జరుగుతుండగా.. కోహ్లీ ఈ అవుట్‌తో చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ డకౌట్ ఫోటోను షేర్‌ చేస్తూ ఉత్తరాఖండ్‌ పోలీస్‌ విభాగం ట్విటర్‌లో ఒక సందేశాన్ని పోస్ట్‌ చేసింది. ”హెల్మెట్‌ పెట్టుకోవడం ఒకటే కాదు.. బాధ్యతాయుతంగా బండి నడపడం కూడా ముఖ్యమే. నిర్లక్ష్యంగా ఉన్నారంటే.. కోహ్లి మాదిరిగా జీవితంలోనూ డకౌట్‌ అవుతారు ”అంటూ ట్వీట్‌ చేసింది. కోహ్లిని కించపరచడం తమ ఉద్దేశం కాదని.. కేవలం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి ట్వీట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

అంతకుముందు పాకిస్థాన్‌పై 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జస్‌ప్రీత్ బుమ్రా చేసిన నోబాల్ తప్పిదాన్ని జైపూర్ ట్రాఫిక్ పోలీసులు అప్పట్లో బ్యానర్లుగా వేయించి సిగ్నల్స్ వద్ద వాహనదారులకి అవగాహన కల్పించారు. భారత్‌లో క్రికెట్‌కి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని అవగాహన కోసం పోలీసులు ఇలాంటివి వాడుతుంటారు. అయితే అప్పుడు రాజస్థాన్ పోలీసులు భూమ్రాకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.