Hyderabad Rainfall : 5 గంటల్లో 62 మిల్లీమీటర్ల వర్షపాతం.. హైదరాబాద్‌లో వాన బీభత్సం
హైదరాబాద్ మీద వరుణుడు పగబట్టాడా? అన్న తీరుగా కుంభవృష్టి పడింది.

Hyderabad Record Breaking Rainfall
Hyderabad Rainfall : బీభత్సమైన ఈదురుగాలులు, భయంకరమైన మెరుపులు ఉరుములతో కూడిన వర్షం భాగ్య నగరాన్ని అతలాకుతలం చేసేసింది. 5 గంటల పాటు నాన్ స్టాప్ గా కురిసిన వాన హైదరాబాద్ ను ముంచెత్తింది. భాగ్యనగర చరిత్రలో రికార్డు స్థాయిలో కేవలం 5 గంటల్లోనే 62.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెరుపులా మొదలై చినుకులా కురిసి గాలివానగా మారింది. హైదరాబాద్ మీద వరుణుడు పగబట్టాడా? అన్న తీరుగా కుంభవృష్టి పడింది. కేవలం 5 గంటల్లో నగరాన్ని స్తంభింపజేసింది. సాధారణ వేసవిలో మే నెలలో ఇలా రికార్డు స్థాయిలో 62.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం హైదరాబాద్ చరిత్రలో ఇది నాలుగోసారి అని పుణెలోని నేషనల్ డేటా సెంటర్ వెల్లడించింది.
పుణెలోని నేషనల్ డేటా సెంటర్ రికార్డుల ప్రకారం.. హైదరాబాద్ చరిత్రలో తొలిసారిగా 1978 మే 24న 79.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత 2016 మే 6వ తేదీన 75.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత 2022 మే 4న 63.1 మిమీ వర్షపాతం నమోదైంది. తాజాగా నిన్న (మే 7,2024) 62.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై నాల్గొవ స్థానాన్ని దక్కించుకుంది.
ఇక.. రాబోయే వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ జిల్లాల్లో (ఒకటి రెండు చోట్ల) భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వాన పడుతుందని వాతావరణ శాఖ అధికారి హెచ్చరించారు.
Also Read : తడిసిన ఉప్పల్ స్టేడియం.. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? భారీ వర్షంతో జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ