‘రఘుపతి వెంకయ్య నాయుడు’ క్యారెక్ట‌ర్ చేయ‌డం నాపూర్వజన్మ సుకృతం – డా. న‌రేష్ వికె

  • Published By: sekhar ,Published On : November 26, 2019 / 10:31 AM IST
‘రఘుపతి వెంకయ్య నాయుడు’ క్యారెక్ట‌ర్ చేయ‌డం నాపూర్వజన్మ సుకృతం – డా. న‌రేష్ వికె

హీరోగా, నటుడిగా ఎన్నోవిజయవంతమైన సినిమాల్లోనటించి, తనదైన నటనతో మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డా.నరేష్ విజయ కృష్ణ. ప్రస్తుతం ‘ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా’గా పిలవబడే రఘుపతి వెంకయ్య నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో టైటిల్ పాత్రలో నటించారు. బాబ్జీ దర్శకత్వంలో ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మండవసతీష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 29న ఈ చిత్రం విడులవబోతున్నసందర్భంగానరేష్ మీడియాతో  సినిమా విశేషాలు పంచుకున్నారు. 

 

రఘుపతి వెంకయ్య నాయుడు గురించి?
ప్రస్తుతం తెలుగు సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా ఎదిగింది. ఇది తెలుగు వారందరికీ గర్వకారణం. అయితే ఈ పరిశ్రమ ఇంత గొప్ప స్థాయికి ఎదగడానికి ఎందరో మహానుభావులు చేసిన త్యాగమే కారణం. అలా తెలుగు సినీ పరిశ్రమకి ఆద్యుడు, పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు. మచిలీ పట్నంలో జన్మించి, చెన్నైకి తరలి వచ్చి తిరుగులేని ఫోటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకొని తన సొంత డబ్బుతో చెన్నైలో 1912లో ‘గెయిటీ’ అనే సినిమా థియేటర్ నిర్మించారు. అదే కాక సౌండ్‌ని విజువల్‌ని సింక్ చేసే క్రోమో మెగాఫోను తీసుకువచ్చిన మహానుభావుడు.

ఆయన మీద సినిమా తీయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది?
మా అమ్మ విజయ నిర్మల గారికి రఘుపతి వెంకయ్య నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు ఆయన విగ్రహం చూసి ఆయన గురించి తెలుసుకోవాలనిపించింది. ఆయన గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు సినిమా కోసం ఆయన పడిన తపన, ఎదుర్కొన్న కష్టాలు తెలుసుకున్నాను. వెంటనే దర్శకుడు బాబ్జీకి చెప్పడం, మండవ సతీష్ గారు నిర్మాతగా నేను చేస్తానని ముందుకు రావడంతో ఈ మూవీ కార్యరూపం దాల్చింది.

కమర్షియల్ అంశాలేమన్నా జోడించారా?
ఈ సినిమా ఒక పీరియాడిక్ మూవీ కాబట్టి కొంత బడ్జెట్ ఎక్కువ అయింది. కానీ ఒక సినిమా చరిత్రకు సంబంధించిన మొదటి పీరియాడిక్ ఫిలిం ఇది అని చెప్పొచ్చు. మొదట ఆయన చరిత్రని డాక్యూమెంటరీగా తీయాలా? లేదా సినిమాగా తీయాలా అనుకుని సినిమా అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని కొన్ని కమర్షియల్ అంశాలు జోడించినప్పటికీ నిజాన్ని నిజంగా తీయడం జరిగింది.

ఈ సినిమా రిలీజ్ లేట్ అవడానికి కారణం ఏంటి?
ఈ సినిమాని దాసరి గారు ఎంతో ప్రేమించారు. ఈ సినిమా ఆయన ఆత్మ గౌరవం అనే వారు. ఈ సినిమా చూశాక దాసరి గారు నన్ను కౌగిలించుకొని మంచి సినిమా అన్నారు. నేను ఇప్పటికి ఆ కౌగిలింతను మర్చిపోలేదు. ఈ సినిమా ఆయన రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఆయన మరణించాక ఈ సినిమా రిలీజ్ కొంత లేట్ అయింది.

ఈ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపిస్తోంది?
రఘుపతి వెంకయ్య నాయుడు పాత్ర నాకు రావడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మ ఆయ‌న‌కి ముని మ‌న‌వ‌రాలు అవుతుంది.. అలా నేను ఆయనకు ముని ముని మనవడిని అవుతాను. అలాగే ఈ సినిమా ట్రైలర్‌ని మహేష్ లాంచ్ చేయడం వల్లనే రెండు మూడు రోజుల్లోనే ఆరు లక్షలకు పైగా ప్రేక్షకులు ట్రైలర్‌ను చూడడం జరిగింది. రాఘవేంద్ర రావు గారు మా సినిమా పోస్టర్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వారిద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా..

ఈ సినిమాలో ఆయన వ్యక్తిగత విషయాలను గురించి కూడా ప్రస్తావించారా?
ఆయన మంచి పెయింటర్, ఆయన భార్య నాంచారమ్మ గారు ఒక డాన్సర్. ఆయన కుటుంబలో చాలా మంది ఆర్మీ నేపథ్యం కలిగిన అధికారులు. ఈ విషయాలన్నీ సినిమాలో చూపించడం జరిగింది.

అంతర్జాతీయ వేదికలపై ఈ మూవీని ప్రదర్శించాలనే ఆలోచనవుందా?
ఖచ్చితంగా ఉంది. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఈమూవీ ప్రదర్శిస్తాం. అలాగే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మూవీ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేలా కోరుతాం.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ?
గత ఏడాది నేను చాలా మంచి సినిమాలలో నటించాను. ఈ ఏడాది కూడా చాలా బిజీగా ఉన్నాను. త్రివిక్రమ్, సుకుమార్, మారుతీ లాంటి దర్శకులు నాకు మంచి పాత్రలు ఇస్తున్నారు. దీనితో పాటు యంగ్ డైరెక్టర్స్ నన్ను ప్రిఫర్ చేయడం సంతోషం. ఎస్వీ రంగారావు గారు నాకు స్ఫూర్తి. ఆయనలా ఏపాత్రనైనా చేయగలను అని నిరూపించుకోవాలి. అందుకే రెమ్యూనరేషన్ తో సంబంధం లేకుండా పాత్ర మంచిదైతే లక్ష రూపాయలు ఇచ్చినా చేస్తాను. నాకు రోల్స్ ముఖ్యం రూపీస్ కాదు. అలాగే మంచి పాత్రలు వస్తే వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను.