Vegetable Farming
Vegetable Farming : తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తూ.. అధిక దిగుబడులను పొందుతున్నారు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు. తనకున్న 6 ఎకరాల్లో కాలానుగుణంగా, డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రణాళిక బద్దంగా పంటల వెనుక పంటలను సాగుచేస్తే.. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఇక్కడ చూడండి… పచ్చగా నిగనిగలాడుతున్న ఈ వంగ తోటలను..ఆ పక్క మిర్చి పంట.. మరో పక్క స్టేకింగ్ విధానంలో టమాట.. ఇంకోపక్క నిండుగా అల్లుకున్న చిక్కుడు. నిర్మల్ జిల్లా, కుంటాల గ్రామంలో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రం రైతు శ్రీనివాస్ ది. 20 ఏళ్లుగా కూరగాయల సాగుచేస్తున్నారు ఈ రైతు. అయితే ప్రణాళిక బద్ధంగా పంటల వెనుక పంటలు వేస్తూ.. ఏడాదికి మూడు పంటలు సాగుచేస్తూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
READ ALSO : Hyderabad : : హైదరాబాద్‌కి తరలివస్తున్న ఆఫ్రికన్లు.. ఎందుకు? ఏ ఏరియాకి..
ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయలకు భలే డిమాండ్ ఉంది. కూరగాయల పంటలను సాగు చేసిన రైతులు ఏడాది పొడువునా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని, రైతు.. శ్రీనివాస్ ఉన్న 6 ఎకరాల వ్యవసాయ భూమిలో సొంతంగా నారు పెంచుతూ.. పలు రకాల కూరగాయ పంటలను సాగుచేస్తున్నారు. ఒక ఎకరంలో వంగ, అర ఎకరంలో టమాట, మరో అర ఎకరంలో మిర్చి, అర ఎకరంలో చిక్కుడును, బీర, ఆకుకూరలు ఇలా పలు పంటలను సాగుచేస్తున్నారు. అయితే ఇవేపంటలను ఏడాది మొత్తం వేయరు రైతు. మార్కెట్ లో డిమాండ్ ను పట్టి పంటల ప్రణాళికలను మారుస్తూ.. అధిక ఆదాయం పొందుతున్నారు.
తక్కువ సమయంలోనే పంట దిగుబడులు చేతికి రావడం, అదికూడా నిరంతరంగా ఉండటంతో ప్రతిరోజు డబ్బులు వస్తున్నాయంటున్నారు రైతు శ్రీనివాస్. సంప్రదాయ పంటలతో పోలిస్తే కూరగాయ పంటలే మేలంటున్నారు. నగరాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఈ పంటలను సాగుచేస్తే ఆర్ధికంగా నిలదొక్కుకోవచ్చని సూచిస్తున్నారు..