Vermi Compost :
Coffee Vermi Compost : అత్యుత్తమ సేంద్రియ ఎరువు వర్మీ కంపోస్టు. ఒకప్పుడు భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండేది. వానపాముల సంచారం అధికంగా కనిపించేది. దీంతో నేల సారవంతమయ్యేది. రసాయన ఎరువుల మితిమీరిన వాడకం వల్ల మట్టికి ఆ ప్రయోజనాలు దూరమయ్యాయి.
ఈ నేపథ్యంలోవ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడతో వర్మీ కంపోస్టుతయారు చేసి పంటలకు అందిస్తే మంచి ఫలితాలనుసాధించవచ్చు. నేరుగా పశువుల ఎరువు వాడితే, దీనిలోని పోషకాలు మొక్కలకు అందడానికి రెండుమూడు నెలల సమయం పడుతుంది. అదే వర్మీ కంపోస్టుద్వారా అయితే, నేరుగా అందించవచ్చు. దీని తయారు ఏవిధంగా చేసుకోవాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం.
Read Also : Agriculture Tips : ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ
సేంద్రియ ఎరువులన్నింటిలో, వర్మీ కంపోస్టులో పోషక విలువలు అధికం. అంతేకాదు, మొక్కలకు కావలసిన ఎంజైములు, హార్మోన్లు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆక్సినోమైట్‌లను అధికంగా కలిగి ఉండటం వల్ల, పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. రైతుకు పురుగు మందుల అవసరాన్ని తగ్గిస్తుంది. దీన్ని నేలకు అందించటం వల్ల నేలలో సూక్ష్మజీవుల వృద్ధి వేగంగా పెరుగుతాయి. ఫలితంగా భూసారం పెరుగుతుంది. అందుకే, వర్మీ కంపోస్టును జీవనాగలి అంటారు.
ఏజెన్సీ రైతులకు అవగాహన కల్పిస్తున్న శాస్త్రవేత్తలు :
వానపాములను రైతుమిత్రులుగా వ్యవహరిస్తారు. ఒక టన్ను వర్మీ కంపోస్టులోని పోషక విలువలను గమనిస్తే, 15 నుండి 30 కిలోల నత్రజని, 10 నుండి 20 కిలోల భాస్వరం, 11 నుండి 18 కిలోల పొటాషియం లభిస్తుంది. సూక్ష్మపోషకాలను కూడా తగిన మోతాదులో మొక్కలకు అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పాడి పశువులు ఉన్న రైతులు చిన్న షెడ్‌ను నిర్మించుకొని, పంట వ్యర్ధాను ఉపయోగించి, స్వయంగా వర్మీ కంపోస్టు తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో గిరాకీ పెరుగుతుండటంతో యువత వర్మీ కంపోస్టు తయారీని ఉపాధి అవకాశంగా మలుచుకొంటున్నారు.
ప్రస్తుతం కిలో వర్మీ కంపోస్టు 7 నుండి 8 రూపాయల ధర పలుకుతున్నది. చక్కటి ప్యాకింగ్‌తో పట్టణాల్లో కిలో 20 రూపాయలకు అమ్ముతున్నారు. అయితే విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని రైతులు సొంతంగా తయారు చేసుకునేందుకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం చింతపల్లిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పలు పద్ధతుల్లో వర్మీకంపోస్ట్ తయారు చేస్తున్నారు.
ముఖ్యంగా ఇక్కడ పండే కాఫీ గింజల నుండి వృదాగా పడేసే పొట్టును ఉపయోగించి వర్మీకంపోస్ట్ తయారు చేస్తున్నారు. రైతులు ఈ విధానం పట్ల అవగాన కల్పిస్తున్నారు. షెడ్లను సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో నిర్మించుకోవాలి. సూర్యరశ్మికి వ్యతిరేక దిశలో ఏర్పాటు చేసుకుంటే, వెలుతురు నేరుగా బెడ్‌లపై పడదు. దీంతో వానపాములపై ఒత్తిడి ఉండదు.
Read Also : Mixed Farming : మిశ్రమ వ్యవసాయంతోనే స్థిరమైన ఆర్థిక వృద్ధి