Backyard Poultry Farming
Backyard Poultry Farming : ఆలోచన ఉండాలే కానీ అవకాశాలు అనేకం. ఎక్కడెక్కడికో వెళ్లి ఉపాధి పొందేకంటే.. సొంత ఇంటి వద్దే ఆదాయం రెట్టింపు చేసుకునే మార్గం కనబడితే, ఆ తృప్తే వేరు కదా. దీనికి చక్కటి మార్గంగా కనిపిస్తోంది పెరటికోళ్ల పెంపకం.
వ్యవసాయానికి అనుబంధంగా చిన్నా, సన్నకారు రైతులు, మహిళలకు మంచి ఉపాధి మార్గంగా నిలుస్తోంది. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ పెరటి కోళ్ల పెంపకంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చని తెలియజేస్తున్నారు ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త.
పెరటి కోళ్లు అంటే పెరట్లో పెంచుకునే సాధారణ కోళ్ల జాతులు. నాటుకోళ్లు మనందరికీ ఇష్టమైన జాతే అయినా… వీటిలో మాంసోత్పత్తి, గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువ వుండటంతో నాటుకోళ్లతో సంకర పరిచి అభివృద్ధి చేసిన అనేక సంకరజాతి కోళ్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసారు. పూర్తిగా నాటుకోళ్లను పోలిన ఈ కోళ్లు అధిక గుడ్ల దిగుబడితోపాటు, కొన్ని జాతుల్లో మాంసోత్పత్తి అధికంగా వుంది. నాటు కోళ్లు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి. కాళ్లు బలంగా, ధృడంగా ఉండి వేగంగా పరిగెత్తడానికి అనువుగా ఉంటాయి.
అయితే వీటి శరీర బరువు పుంజుల్లో రెండున్నర కిలోల నుండి మూడున్నర కిలోల వరకు, పెట్టలు ఒకటున్నర కిలోల నుంచి ఒక కిలో 800 గ్రాముల వరకు మాత్రమే బరువు వుంటాయి. పెట్టలు సాధారణంగా సాలుకు 40 నుంచి 50 గుడ్లు మాత్రమే పెడతాయి.
అదే అభివృద్ధి చేసిన సంకరజాతి కోళ్లు అయితే ఏడాదికి 150 నుండి 180 గుడ్ల వరకు పెడతాయి. ఏడాదికి 3 కిలోల బరువు పెరుగుతాయి. పెరటి కోళ్ల పెంపకం చాలా సులభం. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బాలకృష్ణ.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..