Black Gram Cultivation Techniques in Telugu
Black Gram Cultivation : తక్కువ సమయం, తక్కువ నీటితో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పుజాతి పంట మినుము. మూడు కాలాల్లో సాగుచేసుకోవచ్చు. అంతర పంటగా కూడా వేసుకొని అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుత రబీ లో మినుమును అక్టోబర్ వరకు వేసుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట్టుకునే రకాలను ఎంపికచేసుకుంటే ఆశించిన ఫలితాలు పొందే వీలుంటుంది. మినుములో రబీ కి అనువైన రకాలు, వాటి గుణగణాల ఏంటో ఇప్పుడు చూద్దాం..
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..
తెలుగు రాష్ట్రాల్లో మినుమును అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ పంటను మూడు కాలల్లో సాగుచేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 12.5 లక్షల ఎకరాల్లోను, తెలంగాణలో 3లక్షల 75 వేల ఎకరాల్లో సాగవుతుంది. ప్రస్తుత రబీ లో నీటివసతి కింద, అక్టోబర్ వరకు మినుము విత్తేందుకు అనువైన సమయం. కొన్ని ప్రాంతాలలో ఖరీఫ్ వరి కోసిన మాగాణి పొలాల్లో నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. మురుగునీరు నిలవని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు.
ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే మార్కెట్ లో అనేక ప్రైవేట్ రకాలు ఉన్నప్పటికి.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన అనేక రకాలు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలను నమోదు చేస్తున్నాయి. వాటిలో రబీకి అనువైనవి పి.యు 31 రకం . దీని పంటకాలం 70 నుండి 75 రోజులు. సాదారకం. గుబురుగా, పొట్టిగా ఉండి పొడవైన ఆకులు కలిగి ఉంటాయి. కాయల మీద నూగు ఉంటుంది. పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. ఎకరాకు 5 నుండి 6 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. మరో రకం ఎల్.బి.జి 752 .
దీని పంట కాలం 75 నుండి 80 రోజులు. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకొనే పాలిష్ రకం. వరి మాగాణులలో ఆలస్యంగా విత్తుటకు కూడా, అనువైన రకం. ఎకరాకు 6 నుండి 7 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. రబీలో వేయదగిన మరో రకం ఎల్.బి.జి 787 . పంట కాలం 75 నుండి 80 రోజులు. ఇది పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.
కాండం కణుపుల వద్ద కూడా కాపు కాస్తుంది. పాలిష్, మధ్యస్థ గింజ రకం అన్ని కాలాలకు అనువైన రకం. ఎకరాకు దిగుబడి 8 నుండి 9 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. రెండు మూడు నీటి తడులను ఇచ్చే పరిస్థితి ఉన్న ప్రాంతాలలో మినుమును సాగుచేయాలి. కాలం మించిపోకుండా సరైన సమయంలో విత్తుకుంటే చీడపీడల సమస్య తక్కువ వుండి, అధిక దిగుబడి సాధించే వీలుంటుంది.