Cabbage Cultivation : క్యాబేజి సాగులో మేలైన యాజమాన్యం.. దిగుబడికి సూత్రాలు

Cabbage Cultivation : రైతులు స్వల్పకాలిక రకాలను నార్లు పోసుకుని, నాట్లు వేస్తుండగా, మరికొందరు దీర్ఘకాలిక రకాలను నారుమళ్ళు పోసేందుకు సమాయత్తమవుతున్నారు. క్యాబేజి సాగుకు సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలం.

Cabbage Cultivation Management

Cabbage Cultivation : శీతాకాలంలో అధిక విస్తీర్ణంలోసాగుచేయబడే కూరగాయపంటలు క్యాబేజి,కాలిఫ్లవర్.ఒకప్పుడు చలికాలంలోనే అధిక విస్తీర్ణంలో సాగుచేయబడినా సూపర్ మార్కెట్లు, రిటైల్ మార్కెట్ల రాకతో డిమాండ్ పెరగటం వల్ల రైతులు సంవత్సరం పొడవునా సాగు చేస్తున్నారు. నీటివసతి వున్న పట్టణపరిసరప్రాంతాల్లోని రైతులు వీటిని దఫదఫాలుగా విత్తుకుని,సాగుచేస్తూ లాభపడుతున్నారు. మరి క్యాబేజి సాగులో అధిక దిగుబడులు పొందాలంటే ఆది నుంచి చేపట్టాల్సిన ఆ యాజమాన్య మెళకువలేమిటో తెలుసుకుందామా..

చల్లని వాతావరణం క్యాబేజిసాగుకు అత్యంత అనుకూలం. దీని పంటకాలాన్ని బట్టి స్వల్పకాలికాలని, దీర్ఘ కాలిక రకాలు అని విభజించవచ్చు. సాదారణంగా స్వల్పకాలిక రకాలను ఆగష్టు నుంచి సెప్టెంబరు చివరి వరకు, దీర్ఘ కాలిక రకాలైతే అక్టోబరు మొదటి పక్షం నుంచి నవంబరు చివరి వరకు నాటుకోవచ్చు. ఇప్పటికే కొందరు రైతులు స్వల్పకాలిక రకాలను నార్లు పోసుకుని, నాట్లు వేస్తుండగా, మరికొందరు దీర్ఘకాలిక రకాలను నారుమళ్ళు పోసేందుకు సమాయత్తమవుతున్నారు. క్యాబేజి సాగుకు సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలం.

ఉదజని సూచిక 5.5 నుంచి 6.5వరకు ఉండాలి. క్యాబేజిలో రకాలను చూసినట్లయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన రకాలతో పాటుగా పలు ప్రైవేటు సంస్థల హైబ్రీడ్లు కూడా అందుబాటులో వున్నాయి. వీటిలో గోల్డెన్ ఏకర్, ఎర్లీ డ్రమ్ హెడ్, ప్రైడ్ ఆఫ్ ఇండియా,లేట్ డ్రమ్ హెడ్, పూస డ్రమ్ హెడ్ అనే రకాలు ప్రాచుర్యం పొందాయి. అధిక దిగుబడినిచ్చే వివిధ ప్రైవేటు హైబ్రిడ్ రకాలను కూడా రైతులు సాగుకు ఎంచుకోవచ్చు. ఇప్పుడు నారుమడి పోసే రైతాంగం దీర్ఘకాలిక రకాలను ఎంచుకోవాలి.

ఎకరా పొలంలో విత్తుకోవడానికి సూటిరకాలైతే 300గ్రాముల విత్తనం, సంకర రాకలైతే 100-150గ్రాముల విత్తనం సరిపోతుంది.ఎంచుకున్న విత్తనానికి తప్పనిసరిగా విత్తనశుద్ది చేయాలి.ఇందుకోసం ముందుగా కిలో విత్తనానికి 5మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ తో శుద్దిచేసిన తర్వాత తెగుళ్ళ నివారణకు 3గ్రా.కార్బండిజమ్ కలిపి విత్తనశుద్ది చేయాలి.నారు పోసే ప్రదేశం ఎత్తైన ప్రాంతంగా వుండి, మురుగునీటి సౌకర్యం కలిగి వుండాలి.దీనివల్ల నారుకుళ్ళు తెగులును కొంత వరకు అరికట్టవచ్చు. నారుమడి కోసం  ఎంచుకున్న పొలాన్ని ముందుకు దున్ని అందులో బాగా చివికిన పశువులఎరువు లేదా వర్మీకంపోస్టు వేసి కలియదున్నాలి.

ఒక్కో నారుమడి 4మీటర్ల పొడవు, 1మీటరు వెడల్పు, 10-15సెంటీ మీటర్ల ఎత్తు వుండే విధంగా తయారుచేసుకోవాలి. వీటిపై సెంటీమీటరు లోతు మించకుండా సన్నని గీతలు చేసుకుని అందులో విత్తనం వేసి, మళ్ళీ మట్టిని కప్పాలి. విత్తనం సన్నగా వుండటం వల్ల ఇసుకతో కలిపి వరుసల్లో పలుచగా వేసుకోవాలి.తర్వాత దీనిపై ఎండుగడ్డిని కప్పి, విత్తనం మొలచే వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రోజ్ క్యాన్ తో మడులపై నీటిని అందించాలి. వారం తర్వాత ఎండుగడ్డిని తిసివేసి రోజుకు ఒకసారి నీటితడి ఇస్తే సరిపోతుంది. విత్తిన 15రోజులకు లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 4గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కలిపి నారుమళ్ళను బాగా తడిపినట్లయితే నారుకుళ్ళు తెగులు నుంచి  కాపాడుకోవచ్చు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

ఆధునిక పద్ధతులైన షేడ్ నెట్ల క్రింద ప్రోట్రేలలో కూడా నారును పెంచుకోవచ్చు.రైతు స్థాయిలో పెంచేందుకు 50శాతం నీడనిచ్చే షేడ్ నెట్లు సరిపోతాయి.ఇలా పెంచిన నారుకు చీడపీడల బెడద తక్కువగా వుండి,ఆరోగ్యవంతంగా వుంటాయి.మొలకశాతం కూడా అధికంగా వుండి, రైతుకు విత్తనంపై పెట్టే ఖర్చు కూడా ఆదా అవుతుంది. ఈవిధంగా పెంచిన నారు 30రోజుల వయస్సులో నాటుకోవటానికి సిద్ధంగా వుంటుంది. నారును తీసేముందు పలుచగా ఒక నీటితడి ఇచ్చి,తర్వాత నారును తీసినట్లయితే వేర్లు తెగిపోకుండా వుండి, ప్రధాన పొలంలో తొందరగా నాటుకుంటాయి.

ముందుగా ప్రధానపొలాన్ని బాగా దుక్కిచేసి ఎకరాకు 10టన్నుల పశువుల ఎరువు, 40కిలోల భాస్వరం, 40కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను ఆఖరిదుక్కిలో వేసుకుని కలియదున్నాలి. వరుసల మధ్య 45 నుంచి 60సెంటీమీటర్లు, మొక్కల మధ్యదూరం 45సెంటీమీటర్లు వుండే విధంగా నారు నాటుకోవాలి. వెంటనే నీటితడిని ఇవ్వాలి. ఎకరాకు 32కిలోల నత్రజనినిచ్చే ఎరువుని 3సమభాగాలుగా చేసుకుని విత్తిన 20-25రోజులకు మొదటదఫా,50-55రోజులకు రెండవదఫా, 70రోజుల వయస్సులో మూడవదఫా ఎరువును అందించి, వెంటనే నీటితడిని ఇవ్వాలి. క్యాబేజిలో కలుపు నివారణకు నారునాటిన 1,2 రోజులలోపు ఎకరాకు పెండిమిథాలిన్ 1.25లీటర్లు లేదా అలాక్లోర్ తేలిక నేలలైతే 1లీటరు, బరువునేలలైతే 1.2లీటర్ల మందును 200లీటర్ల నీటిలో కలిపి తగినంత తేమ వున్నప్పుడు పిచికారీ చేయాలి.కలుపు అధికంగా వున్నప్పుడు నాటిన 25నుంచి30రోజుల మధ్య ఒకసారి అంతరకృషి చేసి కలుపును అరికట్టవచ్చు.

నీటియాజమాన్యంలో నేలలను బట్టి తేలిక నేలలైతే వారానికి ఒకసారి, బరువు నేలలైతే 10రోజులకు ఒకతడి ఇస్తే సరిపోతుంది. క్యాబేజికి ప్రధాన శత్రువు డైమండ్ బ్యాక్ మాత్. ఇవి పాలిపోయిన తెలుపు రంగులో వుండి, ఆకుల అడుగు భాగాన చేరి, ఆకులును తిని నాశనం చేస్తాయి.వీటి ఉధృతి ఎక్కువగా వుంటే ఆకులు జల్లెడాకులగా మారి, గడ్డ పరిమాణం పెరగక రైతుకు తీవ్ర నష్టంచేస్తుంది. దీని నివారణకు ప్రధానపొలంలో నారును నాటే సమయంలోనే ప్రతి 25వరుసలకు 2వరుసల్లో ఆవ మొక్కలను ఎరపంటగా వేసికోవాలి.

తల్లి పురుగులు వీటికి ఆకర్షింపబడి మొదట వీటిపై గ్రుడ్లు పెడతాయి. రైతులు దీనిని గమనించి గ్రుడ్లను నాశనం చేసినట్లయితే మొదటి దశలోనే పురుగును  కొంత వరకు అరికట్టిన వాళ్ళమవుతాం. పురుగు ఉధృతిని బట్టి ఎసిఫేట్ 1.5గ్రాము లేదా స్పైనోశాడ్ అయితే 0.3మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి పురుగును నివారించవచ్చు.ఈవిధంగా సాగు చేసిన పైరు గడ్డలు తగిన పరిమాణం వచ్చిన తర్వాత కోసి, మార్కెట్ చేసుకున్నట్లయితే రైతులు ఆశించిన ఆదాయం పొందగలుగుతారు.

Read Also : Paddy Pest Control : వరి పంటలో చీడపీడల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ట్రెండింగ్ వార్తలు