Home Agriculture
Home Agriculture : ఇంటి పైకప్పులన్నీ చాలా వరకు ఖాళీగానే ఉంటాయి. అలాంటి ఖాళీ స్థలాన్ని పెరటి తోట పెంపకం కోసం సద్వినియోగం చేసుకుంటే.. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆహ్లాదానికి ఆహ్లాదం. ఇదే నిజం చేస్తున్నారు.. కృష్ణా జిల్లాకు చెందిన రాజశేఖర్. రెండేళ్లుగా ఇంటిపైకప్పుతో పాటు పెరట్లో కుటుంబానికి అవసరమైన ఆకుకూరలు, కూరగాయలు, పళ్లు పండిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
పెరటి తోటలు .. ఒకప్పుడు పల్లెటూరిలో ఇంటి పెరట్లో మొక్కలు పెంచుకోవడం, కూరగాయలు పండించుకోవడం వంటివి వాడుకలో ఉండేవి. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరేలా పెరటి తోటల్లో తాజా కాయకూరలు దొరికేవి. కానీ ఇప్పుడు జనాభా పెరిగింది..ఇళ్ల నిర్మాణాలు పెరిగాయి.. ఎక్కడా కూడా ఖాళీ స్థలాలు కనిపించడంలేదు. దీంతో ఇప్పుడు మిద్దె తోటల పెంపకం జోరందుకుంది.
అధిక దిగుబడుల కోసం రైతులు రసాయనాలతో పంటలు పండిస్తున్నారు. వీటి వల్ల అనారోగ్యం బారి పడుతున్నారు. అయితే కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై జాగ్రత్త పెరిగింది. తాజా కూరగాయలు, అవికూడా ఆర్గానిక్ విధానంలో పండించినవే తినాలనే ఉద్దేశ్యంతో చాలామంది మిద్దె తోటలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా, పెనమలూరుకు చెందిన రాజశేఖర్ ఆకు కూరలు, కారగాయలు, పూలు, పండ్లు సైతం మిద్దె మీద పండించటం మొదలు పెట్టారు. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పండించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.
మేడ, మిద్దె, డాబా… పేరేదైనా దానితో అనుబంధం మాత్రం ఎవరికి వారికే ప్రత్యేకం. ఇప్పుడా డాబానే ఒత్తిడిని మాయం చేసే చలువ పందిరి అవుతోంది. కూరగాయలు పండించే మిద్దె తోటై మురిపిస్తోంది. నగరాల్లో చల్లదనం కోసం, మొక్కలు పెంచాలన్న కోరిక ఉండీ స్థలం లేనప్పుడూ డాబాలనే ఆశ్రయిస్తున్నారు. ఒక్కసారి కొద్ది మొత్తం పెట్టుబడి పెడితే చాలు, ఏళ్ల తరబడి ప్రయోజనాలు పొందవచ్చు. మిద్దెతోటకోసం చేసే శ్రమ, వ్యాయామం అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
Read Also : Coffee Plantation : అధిక దిగుబడినిచ్చే కాఫీ రకాలు సాగు యాజమాన్యం