Coffee Plantation : అధిక దిగుబడినిచ్చే కాఫీ రకాలు సాగు యాజమాన్యం
Coffee Plantation : విశాఖ ఏజన్సీ ప్రాంతంలో గత 5 దశాబ్ధాలుగా కాఫీ సాగులో వున్నా... గిరిజనులకు సాగుపై సరైన అవగాహన, తగిన ప్రోత్సాహం లేకపోవటంతో దీని ఉనికి నామమాత్రంగానే వుంది.

coffee plantation and management techniques in telugu
Coffee Plantation : కాఫీ సాగుకు దక్షిణ భారతదేశం ప్రసిద్ధి. కాఫీతోటల విస్తీర్ణంతో కర్నాటక అగ్రస్థానంలో ఉండగా… కేరళ, తమిళనాడు రాష్ట్రాలు రెండు, మూడు స్థానాల్లో వున్నాయి. దేశవ్యాప్తంగా లభించే కాఫీ ఉత్పత్తిలో 60 శాతం కర్నాటక నుంచే వస్తుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఏజన్సీలో గత 5 దశాబ్ధాలుగా కాఫీ తోటలు సాగవుతున్నాయి.
ఇక్కడ పండే కాఫీ గింజల్లో నాణ్యత, సువాసన అధికంగా ఉండటంతో దేశీయంగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇక్కడి రైతులు సరైన దిగుబడులను మాత్రం తీయలేకపోతున్నారు. అధిక దిగుబడులను సాధించాలంటే రకాల ఎంపిక … సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు విశాఖపట్నం జిల్లా, ఆర్.వి. నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సునీల్ బాబు.
కాఫీ అనగానే దక్షిణ భారతదేశమే గుర్తొస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కాఫీ సాగుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి.. విశాఖ పట్నం, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాలోని మన్య ప్రాంతాతలకు పరిమితమైనది. విశాఖ ఏజన్సీ ప్రాంతంలో గత 5 దశాబ్ధాలుగా కాఫీ సాగులో వున్నా… గిరిజనులకు సాగుపై సరైన అవగాహన, తగిన ప్రోత్సాహం లేకపోవటంతో దీని ఉనికి నామమాత్రంగానే వుంది. సాధారణంగా కాఫీ తోటల పెరుగుదలకు ప్రత్యేక పరిస్థితులు వుండాలి. సముద్రమట్టం కంటే వెయ్యి నుంచి 2 వేల అడుగుల ఎత్తైన కొండవాలు ప్రదేశాలు దీనికి అనుకూలం. సకాలంలో వర్షాలు, 25 నుంచి 30డిగ్రీలకు మించని ఉష్ణోగ్రత వున్న ప్రదేశాల్లో కాఫీ పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది.
కాఫీ చెట్లకు నీడ వాతావరణం తప్పనిసరిగా వుండాలి. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని పశ్ఛిమ కనుమ పర్వత ప్రాంతాలు ఇందుకు అనుకూలమైనవి కావటంతో సహజంగానే అక్కడ కాఫీతోటలు విస్తరించాయి. ఇదేవిధంగా విశాఖపట్నం జిల్లాలోని తూర్పుకనుమల్లో… అరకు, పాడేరు ఏజన్సీ ప్రాంతాలు కాఫీ సాగుకు అనుకూలంగా వుండటంతో 1960వ దశకం నుంచి గిరిజనులు కాఫీని సాగుచేస్తున్నారు.
కానీ ఇటీవలి కాలంలో ఇక్కడపండే కాఫీకి వాణిజ్య విలువ పెరగటంతో రైతులు సాగుపట్ల అధిక ఆసక్తిచూపుతున్నారు. అయితే అధిక దిగుబడిని ఇచ్చే పలు రకాలను విశాఖపట్నం జిల్లా, ఆర్.వి. నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది. రైతులు వాటిని నాటి సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులను పొందవచ్చు.
కాఫీ తోటలకు నీడ వాతావరణం ఉండాలి. అందుకోసం కొత్తగా మొక్కలు నాటాలనుకునే వారు అంతర పంటలుగా సాగు చేసుకోవాలని కాఫీ తోటల్లో ఎలాంటి పండ్లు, సుగంధ ద్రవ్య మొక్కలు నాటుకోవాలి… ఎకరాకు ఎన్ని మొక్కలు నాటుకుంటే మంచిదో వివరాలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..